Bhagavad Gita: Chapter 1, Verse 38-39

యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః ।
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ।। 38 ।।
కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ ।
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ।। 39 ।।

యది అపి — అయినా సరే; ఏతే — వారు; న పశ్యంతి — చూడలేకున్నా; లోభ — దురాశ; ఉపహత — కమ్ముకున్న; చేతసః — ఆలోచనలతో; కుల-క్షయ-కృతం — బంధువులను నాశనం చేయటంలో; దోషం — తప్పు; మిత్ర-ద్రోహే — స్నేహితులపై ద్రోహం చేయటం వలన; చ — మరియు; పాతకం — పాపము; కథం — ఎందుకు; న జ్ఞేయం — తెలుసుకోరాదు; అస్మాభిః — మనము; పాపాత్ — పాపము నుండి; అస్మాత్ — ఇవి; నివర్తితుం — మరలిపోవుట; కుల-క్షయ — బంధువులను సంహరించటం; కృతం — చేసి; దోషం — నేరము; ప్రపశ్యద్భిః — తెలిసిన వారమై; జనార్దన — అందరి పోషణ, రక్షణ చూసుకునే వాడా, శ్రీ కృష్ణా.

Translation

BG 1.38-39: వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి, బంధువులను సర్వనాశనం చేయటంలో గాని లేదా మిత్రులపై విశ్వాసఘాతుకత్వం చేయటంలో గానీ, వారు దోషం చూడటం లేదు. కానీ, ఓ జనార్దనా (కృష్ణా), మనవారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము, ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు?

Commentary

వృత్తి రీత్యా యోధుడే అయినా, అర్జునుడు అనవసరపు హింసని అసహ్యించుకొన్నాడు. మహాభారత యుద్ధం చివరిలో జరిగిన ఒక ఘట్టం అతని యొక్క ఈ గుణాన్ని వెల్లడిస్తుంది.

వంద మంది కౌరవులు చంపబడ్డారు, కానీ దానికి ప్రతీకారంగా, ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ, రాత్రి వేళ పాండవ శిబిరం లోనికి చొరబడి ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను, వారు నిద్రిస్తుండగా చంపివేశాడు. అశ్వత్థామని పట్టుకుని అతన్ని పశువులాగా కట్టివేసి, అతడిని, శోకిస్తూ వున్న ద్రౌపది కాళ్ళ వద్ద పడవేశాడు అర్జునుడు. కానీ, క్షమాగుణము మరియు సున్నిత హృదయం కలిగిన ద్రౌపది, అశ్వత్థామ తమ గురువు ద్రోణాచార్యుని పుత్రుడు అయినందువల్ల అతణ్ణి క్షమించాలి అని అన్నది. మరో పక్క, అశ్వత్థామని వెంటనే చంపివేయాలని భీముడు అభిప్రాయపడ్డాడు. ఈ సందిగ్ధావస్థలో, అర్జునుడు శ్రీ కృష్ణుని వైపు పరిష్కారం కోసం చూసాడు. కృష్ణుడు అన్నాడు, ‘గౌరవింపదగిన బ్రాహ్మణుడు తాత్కాలికంగా ధర్మపథం నుండి తప్పినా అతణ్ని తప్పకుండా క్షమింపవలసినదే. కానీ, ఆయుధాన్ని పట్టి చంపటానికి వచ్చిన వాడిని తప్పకుండా శిక్షించవలసినదే.’ అని. అర్జునుడు ఈ విరుద్ధమైన సూచనలను అర్థం చేసుకున్నాడు. అశ్వత్థామను చంపలేదు కానీ, అతని తల వెనుక పిలకను కత్తిరించి, అతని నుదురుపై ఉన్న మణిని తొలగించి, అతణ్ని శిబిరం నుండి బహిష్కరించాడు. కాబట్టి, సాధ్యమైనంత వరకు హింసని విడనాడటం అర్జునుడి సహజ స్వభావం. ఈ ప్రత్యేక పరిస్థితిలో, పెద్దలని, బంధువులని చంపటం తగని పని అని తనకు తెలుసునంటున్నాడు.

ఋత్విక్ పురోహితాచార్యైర్ మాతులాతిథి సంశ్రితైః
బాలవృద్దాతురైర్ వైద్యైర్ జ్ఞాతిసంబంధిబాంధవైః

(మను స్మృతి 4.179)

‘యజ్ఞం చేసే బ్రాహ్మణుడు (ఋత్వికుడు), పురోహితుడు, గురువు, మేనమామ, అతిథి, తనపై ఆధారపడి ఉన్నవారు, పిల్లలు, పెద్దలు, వైద్యుడు, మరియు బంధువులు - వీరితో కలహం పెట్టుకోరాదు.’ దురాశకు వశమైపోయిన కౌరవులు విచక్షణా జ్ఞానం కోల్పోయి ధర్మపథం నుండి తప్పుకున్నా, ఏ దురుద్దేశం లేని తను, ఈ పాడు పని ఎందుకు చేయాలి అని అర్జునుడు భావించాడు.

Watch Swamiji Explain This Verse