Bhagavad Gita: Chapter 11, Verse 26-27

అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః
సర్వే సహైవావనిపాలసంఘైః।
భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ
సహాస్మదీయైరపి యోధముఖ్యైః ।। 26 ।।
వక్త్రాణి తే త్వరమాణా విశంతి
దంష్ట్రాకరాళాని భయానకాని ।
కేచిద్విలగ్నా దశనాంతరేషు
సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః ।। 27 ।।

అమీ — ఇవి; చ — మరియు; త్వాం — నీవు; ధృతరాష్ట్రస్య — ధృతరాష్ట్రుని యొక్క; పుత్రాః — పుత్రులు; సర్వే — అందరూ; సహ — కూడి; ఏవ — ఇంకా; అవని-పాలా — వారి యొక్క అనుబంధిత రాజులు; సంఘైః — సంఘము; భీష్మః — భీష్ముడు; ద్రోణః — ద్రోణుడు; సూత-పుత్రః — కర్ణుడు; తథా — మరియు; అసౌ — ఈ; సహ — కూడి; అస్మదీయైః — మన వైపు నుండి; అపి — కూడా; యోధ-ముఖ్యైః — ముఖ్యమైన యోధులు; వక్త్రాణి — నోర్లు; తే — నీ యొక్క; త్వరమానాః — త్వరపడుచూ; విశంతి — ప్రవేశిస్తున్నారు; దంష్ట్రా — దంతములు; కరాళాని — భయంకరమైన; భయానకాని — భీతిని గొలిపే; కేచిత్ — కొంతమంది; విలగ్నాః — చిక్కుకొని పోయి; దశన-అంతరేషు — పళ్ళ (దంతముల) మధ్యలో; సందృశ్యంతే — కనబడుతున్నారు; చూర్ణితైః — చితికిపోయి; ఉత్తమ-అంగైః — శిరస్సులతో.

Translation

BG 11.26-27: ధృతరాష్ట్రుడి కుమారులందరూ, వారి సహచర రాజులతో సహా, భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు ఇంకా మన పక్షమున ఉన్న యోధులు కూడా తలకిందులుగా నీ భయంకరమైన నోళ్లలోనికి త్వరితగతిన ప్రవేశిస్తున్నారు. కొందరి తలలు నీ భీకరమైన పళ్ళ మధ్యలో చితికిపోయినట్టు నేను చూస్తున్నాను.

Commentary

అర్జునుడు చెప్పే ఈ భగవంతుని యొక్క దంతములు అంటే ఏంటి? ఇంతకు క్రితం శ్లోకంలో కూడా వీటిని గురించి చెప్పాడు. మనం మన పళ్ళను ఆహారాన్ని నమలటానికి వాడుతాము. భగవంతుని దంతములు అంటే, అవి అందరినీ కాల క్రమంలో మృత్యువు దిశగా చూర్ణం చేసే శక్తి స్వరూపములు. అమెరికన్ కవి, హెచ్. డబల్యూ. లాంగ్‌ఫెల్లో (H. W. Longfellow) ఆంగ్లంలో ఇలా వ్రాసాడు.

Though the mills of God grind slowly,
Yet they grind exceeding small;
Though with patience he stands waiting,
With exactness grinds he all.

గొప్పగొప్ప కౌరవ యోధులు — భీష్ముడు, ద్రోణాచార్యుడు, మరియు కర్ణుడు — మరియు మరెందరో పాండవ పక్షయోధులు కూడా, భగవంతుని నోటిలోనికి తలకిందులుగా త్వరగా వేగగతిన పోయి, ఆయన పళ్ళ మధ్య నలిగి పోవటం అర్జునుడు గమనించాడు. అతి త్వరలో జరగబోయే పరిణామాలని ఆ భగవంతుని యొక్క విశ్వరూపములో దర్శిస్తున్నాడు. భగవంతుడు కాల పరిమితికి అతీతుడు కాబట్టి, భూత-వర్తమాన-భవిష్యత్తులన్నీ ఆయనయందు ఇప్పుడే కనిపిస్తుంటాయి.

కౌరవులకు మరియు పాండవులకు పితామహుడైన భీష్ముడు, శంతను మహారాజు మరియు గంగాదేవి యొక్క పుత్రుడు. తన తండ్రి పునర్వివాహం కోరిక సఫలం చేయటానికి వీలుగా భీష్ముడు సింహాసన హక్కుని త్యజించాడు, అంతేకాక, ఆజన్మ బ్రహ్మచర్యం శపథం చేసాడు. కానీ, దుర్యోధనుడు చెడ్డవాడు మరియు పాండవుల రాజ్య హక్కుని అన్యాయంగా లాక్కుంటున్నాడు అని తెలిసి కూడా భీష్ముడు దుర్యోధనుడి వైపే ఉన్నాడు. అందుకే, ఈ యొక్క ధర్మానికి మరియు అధర్మానికి మధ్య జరిగే యుద్ధంలో ఆయనకు చావు రాసిపెట్టే ఉంది. భీష్ముడు తన చివరి సమయంలో అంపశయ్య (బాణములతో తయారుచేయబడ్డ మంచము) మీద పరుండి, భగవంతునికి ఆయన చేసిన స్తుతిని, శ్రీమద్ భాగవతము, ఇలా పేర్కొంటున్నది:

సపది సఖి-వచో నిశమ్య మధ్యే

నిజ-పరయోర్ బలయో రథం నివేశ్య
స్థితవతి పర-సైనికాయుర్ అక్ష్ణా

హృతవతి పార్థ-సఖే రతిర్ మమాస్తు (1.9.35)

‘తన స్నేహితుని ఆదేశాన్ని శిరసావహించి, రథాన్ని ఉభయ సేనల మధ్యకి నడిపించిన అర్జునుడి ప్రియ మిత్రుడైన శ్రీకృష్ణుడిపై నేను ధ్యానం చేస్తున్నాను. అక్కడ శత్రుపక్షపు యోధుల జీవిత కాలాన్ని కేవలం తన చూపుతో తగ్గించివేసాడు.’ కాబట్టి, పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానునికి వ్యతిరేకంగా పోరాడితే మరణం తప్పదని భీష్ముడికి తప్పకుండా తెలుసు.

కౌరవులకు మరియు పాండవులకు కూడా ద్రోణాచార్యుడు సైనిక విద్యాగురువు. ఆయన ఎంత నిష్పక్షపాతమైన మనిషి అంటే తన కొడుకు అశ్వత్థామ కంటే అర్జునుడికే ఎక్కువ యుద్ధవిద్య నేర్పించాడు. కానీ, తన జీవన పోషణ కోసం దుర్యోధనునిపై ఆధార పడ్డాడు కాబట్టి తప్పనిసరై దుర్యోధనునికి సహాయం చేయవలసి వచ్చింది. అందుకే ద్రోణాచార్యుడికి కూడా ఈ యుద్ధంలో మరణం రాసిపెట్టి ఉంది. అయినా, ఆయన యొక్క ధీరత్వం ఎలా కొలవచ్చు అంటే, యుద్ధంలో పాండవులు ఆయనను ఏవిధంగానూ సంహరించలేకపోయి, ఆయననే సలహాకోసం సంప్రదిస్తే, తానే వారికి పరిష్కారాన్ని సూచించాడు.

కర్ణుడు దుర్యోధనుని ప్రియ మిత్రుడు కాబట్టి కర్ణుడు కౌరవుల పక్షానే యుద్ధం చేసాడు. ఆయన కూడా వీరుడే. శ్రీ కృష్ణుడు ఎప్పుడైతే కర్ణుడు కుంతీ దేవి యొక్క జ్యేష్ఠ పుత్రుడు అని, నిజానికి పాండవులు ఆయన సోదరులు అని ఆయనకు తెలియచేసాడో, అప్పుడు కర్ణుడు ఈ రహస్యాన్ని యుధిష్ఠిరునికి చెప్పవద్దు అంటాడు, లేకపోతే యుధిష్ఠిరుడు కర్ణుడిని సంహరించటానికి ప్రయత్నించకుండా యుద్ధంలో ఓడిపోతాడు అంటాడు. కర్ణుడు దుర్యోధనుడి పక్షము తీస్కున్నాడు కాబట్టి ఆయన కూడా మరణించటం తథ్యమే.