Bhagavad Gita: Chapter 12, Verse 18-19

సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః ।
శీతోష్ణసుఖదుఃఖేషు సమః సంగవివర్జితః ।। 18 ।।
తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ ।
అనికేతః స్థిరమతిర్భక్తిమాన్ మే ప్రియో నరః ।। 19 ।।

సమః — ఒకేలాగా; శత్రౌ — శత్రువు పట్ల; చ — మరియు; మిత్రే — మిత్రుని పట్ల; చ తథా — మరియు ఇంకా; మాన-అపమానయోః — గౌరవము, అపమానముల యందు; శీత-ఉష్ణ — చలి మరియు వేడిమిలో; సుఖ-దుఃఖేషు — సుఖదుఃఖముల యందు; సమః — ఒక్కలాగే ఉంటూ; సంగ-వివర్జితః — చెడు సాంగత్యము విడిచి; తుల్య — ఒకేలాగా పరిగణిస్తూ; నిందా-స్తుతి — దూషణ మరియు పొగడ్త; మౌనీ — మౌనముగా చింతన; సంతుష్టః — తృప్తిగా ఉంటూ; యేన కేనచిత్ — దేనితో అయినా; అనికేతః — నివాస స్థానము పై మమకారఆసక్తి లేకుండా; స్థిర — స్థిరముగా; మతి — బుద్ధి; భక్తి-మాన్ — భక్తితో నిండి ఉన్నవాడు; మే — నాకు; ప్రియః — చాలా ప్రియమైన; నరః — వ్యక్తి.

Translation

BG 12.18-19: ఎవరైతే, మిత్రులపట్ల మరియు శత్రువుల పట్ల ఒక్కలాగే ఉంటారో, గౌరవము-అపమానముల ఎడ, చలి-వేడిమి పట్ల, సుఖ-దుఖఃముల పట్ల సమబుద్ధితో ఉంటారో, మరియు చెడు సాంగత్యమును విడిచి ఉంటారో; దూషణ మరియు పొగడ్తని ఒక్కలాగే తీసుకుంటారో, మౌనముగా చింతన చేస్తుంటారో, తమకు లభించిన దానితో తృప్తిగా ఉంటారో, నివాసస్థానము పట్ల మమకారాసక్తి లేకుండా ఉంటారో, ఎవరి బుద్ధి స్థిరముగా నా యందే లగ్నమై ఉన్నదో, మరియు ఎవరైతే నాయందు భక్తితో నిండిపోయి ఉన్నారో, అటువంటి వ్యక్తులు నాకు చాలా ప్రియమైనవారు.

Commentary

శ్రీ కృష్ణుడు ఇక్కడ ఇంకా పది లక్షణములను విశదీకరిస్తున్నాడు.

శత్రువు మరియు మిత్రుని పట్ల ఒక్కలాగే ఉండుట. భక్తులు అందరిపట్ల మంచి భావనతోనే ఉంటారు, శత్రుత్వము లేదా మిత్రుత్వము యొక్క భావనలతో ఉద్వేగపడరు. ఈ విషయంలో ప్రహ్లాదుని గురించి ఒక కథ ఉంది:

ఒకసారి ఆయన పుత్రుడు విరోచనుడు, ప్రహ్లాదుని గురువుగారి పుత్రుడైన సుధన్వుడుతో వాగ్వివాదానికి దిగాడు. విరోచనుడు అన్నాడు, ‘నేనే నీకన్నా గొప్పవాడిని ఎందుకంటే నేను ఒక మహారాజు గారి కొడుకుని.’

సుధన్వుడు అన్నాడు, ‘నేనే గొప్ప ఎందుకంటే నేను ఒక ఋషి పుత్రుడను.’ వారిద్దరూ చిన్నవారే, వారి క్షణికావేశంలో పందెం వేసుకున్నారు. వారిద్దరూ ఇలా అనుకున్నారు, ‘ఎవరు గొప్పవాడని తేలితే వారే బ్రతకాలి రెండవ వాడు చనిపోవాలి.’ అని. మరిక దీనికి న్యాయనిర్ణేత ఎవరు? సుధన్వుడు విరోచనునితో ఇలా అన్నాడు, ‘మీ తండ్రి గారు ప్రహ్లాదుడే దీనికి న్యాయ నిర్ణేత.’

విరోచనుడు ఆశ్చర్యంతో అన్నాడు, ‘నిజంగానా! కానీ ఆయన పక్షపాతంతో వ్యవహరించాడని అంటావేమో.’

‘కాదు, మా తండ్రి గారు అంగీర ఋషి చెప్పాడు, మీ తండ్రి ప్రహ్లాదుడు సంపూర్ణ నిష్పక్షపాతి, ఆయన మిత్రునికి శత్రువుకి తేడా చూపించడు.’ అని అన్నాడు సుధన్వుడు.

ఆ ఇద్దరు పిల్లలూ ప్రహ్లాదుని వద్దకు వెళ్లారు. విరోచనుడు అడిగాడు, ‘తండ్రీ, నేను గొప్పవాడినా లేక సుధన్వుడా?’ అని.

ప్రహ్లదుడు, ‘ఈ ప్రశ్న అసలు ఎందుకు వచ్చింది?’ అని అడిగాడు.

విరోచనుడు అన్నాడు, ‘నాన్నా, మేమిద్దరం పందెం వేసుకున్నాము, ఎవరు గొప్పవాడు అని తేలితే వాడు బ్రతికి ఉండాలి, రెండవ వాడు చనిపోవాలి అని.’

ప్రహ్లాదుడు నవ్వి ఇలా అన్నాడు,’నీ మిత్రుడు సుధన్వుడే గొప్పవాడు ఎందుకంటే ఆయన నీ తండ్రి యొక్క గురువు గారి పుత్రుడు, కాబట్టి.’ ప్రహ్లాదుడు తన సేవకులకు ఇలా ఆదేశం ఇచ్చాడు, ‘నా పుత్రుడిని ఉరికంబం దగ్గరికి తీసుకెళ్లి ఉరి వేయండి’ అని.

ఆ సమయంలో సుధన్వుడు జోక్యం చేసుకున్నాడు. ‘ఆగండి!’ అన్నాడు ప్రహ్లాదునితో. ‘నాకొక రెండవ ప్రశ్న ఉంది, నేను మీకన్నా గొప్పవాడినా?’

ప్రహ్లాదుడు ఇలా జవాబు ఇచ్చాడు , ‘నేను రాక్షస వంశములో జన్మించాను, నీవేమో ఒక ఋషి కుమారుడవు. ఆయన నా గురువు గారు కూడా, అందుకే నీవే గొప్పవాడివి’ అని.

సుధన్వుడు, ‘అదే నిజమైతే మరి నా యొక్క ఆజ్ఞ ను పాటిస్తారా?’, అని మరల అడిగాడు.

‘తప్పకుండా’ అన్నాడు ప్రహ్లాదుడు.

‘సరే, అయితే విరోచనుడిని విడిచిపెట్టండి’ అన్నాడు సుధన్వుడు.

ప్రహ్లాదుడు, ఏవిధంగానయితే, ‘నా పుత్రుడిని ఉరికంబం దగ్గరికి తీసుకెళ్లి ఉరి వేయండి’ అని అన్నాడో , అదే విధంగా తన భటులను, ‘అతన్ని వదిలి పెట్టండి’ అని ఆజ్ఞ ఇచ్చాడు.

దేవతలు ఆయన సభలో పూల వాన కురిపించి, ప్రహ్లాదుని యొక్క న్యాయ శ్రేష్ఠతని కొనియాడారు. ఈ యొక్క న్యాయ దృక్పథం ప్రహ్లాదునికి సహజంగానే వచ్చింది ఎందుకంటే ప్రహ్లాదుడు ఒక పరిపూర్ణమైన భగవత్ భక్తుడు; స్నేహితుడు, శత్రువు, బంధువు, దగ్గరివాడు లేదా పరాయివాడు - వీరందరి పట్ల అతడు ఒక్కలాగే ఉన్నాడు.

గౌరవము లేదా అవమానము పట్ల సమత్వబుద్ధితో ఉండుట: భక్తులు తమకు మర్యాద జరిగినా లేదా అవమానము జరిగినా పట్టించుకోరని కూడా శ్రీ కృష్ణుడు చెప్తున్నాడు. ఇది ఎలాగంటే, ఒక వ్యక్తి అక్రమ సంబంధము ప్రారంభిస్తే, ఎవరైనా ఇతరులు గమనిస్తున్నారేమో అని ఆ వ్యక్తి చూస్తుంటాడు, కానీ ఆ సంబంధము గాఢంగా మారిన తరువాత, ఆ వ్యక్తి అది తనకు తెచ్చే అపకీర్తి గురించి ఇక పట్టించుకోడు. ఇదే విధంగా, భక్తుని హృదయములో దివ్య ప్రేమాగ్ని ఎంత ప్రకాశవంతంగా వెలుగుతుందంటే, అతనికి ప్రాపంచిక మాన-అపమానములు విలువలేకుండా ఉంటాయి.

శీతోష్ణములలో మరియు సుఖదుఃఖాలలో ఒక్కలాగే ఉండటం: భక్తులు అనుకూల మరియు ప్రతికూల పరిస్థితులలో ఒక్కలాగే ఉంటారు. ఇవేవీ శాశ్వతమైనవి కావు అని వారికి తెలుసు. అవి పగలు-రాత్రి లాగా వచ్చి పోతూ ఉంటాయి, కాబట్టి భగవంతుడి నుండి తమ మనస్సుని దూరం చేసి, వాటి మీద ఆలోచించటం దండగ అని వారి అభిప్రాయం.

రామకృష్ణ పరమహంస గారి జీవితం లోని ఒక సంఘటన సాధువుల స్వభావం గురించి మనకు తెలియచేస్తుంది. ఆయనకి పెద్ద వయస్సులో గొంతు క్యాన్సర్ వచ్చింది. జనులు ఆయనను కాళీమాతని ఆయన వ్యాధి నయంచేయమని ప్రార్థించమని అడిగారు. ఆయన ఇలా అన్నారు, ‘నా మనస్సు కాళీ మాత పట్ల ప్రేమతో నిండి ఉన్నది, దానిని అమ్మవారి నుండి దూరం చేసి ఈ యొక్క శారీరక క్యాన్సర్ వైపు ఎందుకు మళ్లించాలి? భగవంతుని సంకల్పము ఎలా ఉంటే అలాగే కానివ్వండి.’ అన్నాడు.

ప్రతికూల సాంగత్యమును విడిచి ఉండుట: వ్యక్తులు లేదా వస్తువులతో సాంగత్యమునే ‘సంగము’ అంటారు. రెండు రకాల ‘సంగము’ లు ఉన్నాయి. మన మనస్సుని లౌకిక ప్రాపంచిక విషయాల దిశగా తీసుకెళ్లే సాంగత్యమును ‘కుసంగము’ (చెడు/ప్రతికూల సాంగత్యము) అంటారు, మరియు మనస్సుని ప్రపంచము నుండి వేరుగా, భగవంతుని దిశగా తీసుకువెళ్లే సాంగత్యమును ‘సత్సంగము’ (అనుకూల/మంచి సాంగత్యము) అంటారు. భక్తులు ప్రాపంచిక తలంపులను ఆస్వాదించరు కాబట్టి సహజంగానే కుసంగము విడిచి పెట్టి, సత్సంగములో నిమగ్నమౌతారు.

పొగడ్త మరియు దూషణని ఒక్కలాగే తీసుకొనుట: బాహ్యమైన వాటి నుండి ప్రేరణ లభించే వారికి, ఇతరుల నుండి లభించే ప్రశంస లేదా తిరస్కారము చాలా ప్రధానంగా అనిపిస్తాయి. కానీ, భక్తులకు వారు పాటించే ఆదర్శాల వల్ల, అంతర్గతంగా లోనుండే ప్రేరణ లభిస్తుంది. కాబట్టి, ఇతరుల మెచ్చుకోలు లేదా విమర్శ వారిలో ఏమీ తేడా చూపించదు.

మౌనముగా ధ్యానము/చింతన చేసుకొనుట: కాకులు మరియు హంసలు పూర్తి విరుద్ధమైన అభిరుచులు కలిగి ఉంటాయి. కాకులు చెత్త కుప్పల పట్ల ఆకర్షితమయితే, హంసలు ప్రశాంతమైన కొలనుల పట్ల ఆకర్షితమౌతాయి. అదే విధముగా ప్రాపంచిక వ్యక్తుల మనస్సులు భౌతిక ప్రాపంచిక విషయముల పట్ల మాట్లాడుకోవటంలోనే ఆనందాన్ని అనుభవిస్తాయి. కానీ, సాధు-భక్తులు స్వచ్ఛమైన మనస్సులను కలిగి ఉంటారు, అందుకే ప్రాపంచిక విషయములు వారికి చెత్త కుప్పలు ఎంత ఆకర్షణీయముగా ఉంటాయో అంతే ఆకర్షణీయముగా ఉంటాయి. అంటే వారి ఏమీ మాట్లాడరు అని అర్థం కాదు. కొలనులపట్ల హంస ఆకర్షితమైనట్టు, వారి మనస్సులు భగవంతుని యొక్క నామములు, రూపములు, లీలలు, మరియు మహిమల పట్ల ఆసక్తితో ఉంటాయి.

తమకు లభించిన దానితో తృప్తిగా ఉండుట: భక్తుల యొక్క అవసరాలు కేవలం శరీర నిర్వహణ కోసం కావలసినంత మాత్రమే ఉంటాయి. సంత్ కబీర్ తన ప్రఖ్యాత పద్యంలో ఈ విషయాన్ని పేర్కొన్నాడు.

మాలిక్ ఇతనా దీజియే, జామే కుటుంబ సమాయ

మైఁ భీ భూకా న రహుఁ, సాధు న భూఖా జాయ

‘ఓ భగవంతుడా, నా కుటుంబ శరీర పోషణకు సరిపోయేంత, మరియు ఇంటికి వచ్చిన సాధువుకు పెట్టగలిగే అంత మాత్రమే నాకు ప్రసాదించుము.’

నివాస స్థానము పట్ల మమకార-అనురాగం లేకుండుట: ఈ భూలోకంపై ఏ ఇల్లు కూడా ఆత్మకు శ్శాశ్వత నివాస స్థానం కాజాలదు, ఎందుకంటే మరణ సమయంలో అన్నింటినీ విడిచిపెట్టేయాలి. మొగలు సార్వభౌముడు అక్బర్, రాజధాని ఫతేపూర్ సిక్రి నిర్మించినప్పుడు, ఈ క్రింది సూత్రాన్ని ప్రధాన గేటుపై చెక్కించాడు: ‘ఈ ప్రపంచం ఒక వంతెన; దాని దాటివెళ్ళు కానీ దానిపై ఇల్లు కట్టకు.’ (The world is a bridge; cross over it but build no house on it.) అని. ఇదే అర్థంలో కృపాలు జీ మహారాజ్ ఇలా పేర్కొన్నారు:

జగ మేఁ రహో ఐసే గోవింద రాధే,

ధర్మశాలా మేఁ యాత్రీ రహేఁ జ్యోఁ బతా దే

(రాధా గోవింద గీతము)

‘ఒక బాటసారి దారిపక్క హోటల్లో బస చేసినట్టు (మరుసటి ఉదయం దాన్ని ఖాళీ చేయాలి అని గ్రహించి) , నీవు ఈ ప్రపంచంలో నివసించుము.’ ఈ మాటల్లోని నిజాన్ని తెలుసుకున్న పిదప, భక్తులు తమ ఇంటిని ఒక తాత్కాలికమైన నివాస స్థానముగానే పరిగణిస్తారు.

బుద్ధి నా యందే స్థిరముగా నిలిపి ఉంచుట. జగత్తులో భగవంతుని యొక్క అత్యున్నత స్థానము మరియు భగవంతునితో తమకు ఉన్న సంబంధము పట్ల భక్తులకు దృఢవిశ్వాసం ఉంటుంది. ప్రేమతో శరణాగతి చేస్తే, భగవత్ కృపచే వారు అత్యున్నత స్థాయిని పొందుతాము అన్న గట్టి నమ్మకం వారికి ఉంటుంది. అందుకే వారు ఒక ఆకర్షణ నుండి ఇంకొక ఆకర్షణకు లేదా ఒక మార్గము నుండి ఇంకో మార్గముకు పోరు.

ఇటువంటి దృఢ సంకల్పము కల భక్తులు తనకు ఎంతో ప్రియమైన వారు అని శ్రీ కృష్ణుడు ప్రకటిస్తున్నాడు.