Bhagavad Gita: Chapter 16, Verse 16

అనేకచిత్తవిభ్రాంతాః మోహజాలసమావృతాః ।
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేఽశుచౌ ।। 16 ।।

అనేక — చాలా; చిత్త — ఊహలు/తలంపులు; విభ్రాంతాః — ఏటో త్రోవతప్పి; మోహ — భ్రమ; జాల — వల; సమావృతాః — ఆవరింపబడి; ప్రసక్తాః — వ్యసనానికి బానిసై; కామ-భోగేషు — ఇంద్రియ సుఖాల తృప్తి కై; పతంతి — పతనమై; నరకే — నరకానికి; అశుచౌ — శుచి లేని.

Translation

BG 16.16: ఇటువంటి ఊహలు, తలంపులతో తప్పుదారి పట్టి, చిత్తభ్రాంతి వలలో చిక్కుకుపోయి, మరియు ఇంద్రియ సుఖాల తృప్తికి బానిసైపోయి, వారు అధోః నరకాలకు పతనమై పోతారు.

Commentary

అహంకారపు పట్టులో, జనులు తమని తాము తమ యొక్క మనస్సుతో అనుసంధానం చేసుకుని దానియొక్క భ్రష్టుపట్టిన మరియు నిరంతరంగా వచ్చే ఆలోచనా పరంపరకు బానిసై పోతారు. పూర్తిగా తమ మనస్సు యొక్క ఆధీనము లోనికి వెళ్ళిపోతారు, ఏదో పాడైపోయిన టేపురికార్డర్ లా అది పదే పదే తిరుగుతుంటుంది; మరియు వారి మనస్సు సృష్టించిన జగత్తులో నివసిస్తుంటారు. అపవిత్రమైన మనస్సుకి ఇష్టమైన ఇటువంటి ఒక పని ఏమిటంటే, అస్తమానం ఫిర్యాదు చెయ్యటం. అది ఎప్పుడూ మనుష్యుల పట్లే కాక, పరిస్థితుల పట్ల కూడా సణుగుతూ, కోపంతో ఉంటూ ఉంటుంది. దీని యొక్క పరిణామం ఏమిటంటే, ‘ఇలా కాకూడదు’, ‘నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు’, ‘నాకు సరిగా మర్యాద ఇవ్వటం లేదు’, మొదలైనవి. మనకున్న ప్రతి ఒక్క అసంతృప్తి/ఫిర్యాదు మన మనస్సు సృష్టించినదే, మరియు వ్యక్తి దాన్ని గుడ్డిగా పూర్తిగా నమ్మేస్తాడు. తలకాయలో ఉన్న స్వరం, మన జీవితం గురించి దుఃఖపూరిత, ఆందోళనకర, లేదా క్రోధపూరిత కథలను చెప్తుంటుంది. పాపం ఆ వ్యక్తి, అహంకారము యొక్క పట్టులో ఉండి, ఆ చెప్పబడే దానిని నమ్ముతాడు. ఈ అసంతృప్తి/ఫిర్యాదు తీవ్రమైనప్పుడు, అది ఆక్రోశముగా మారుతుంది. ఆక్రోశము అంటే దుఃఖంతో, కోపంగా, వేదనతో, మనస్సు నొప్పించబడినట్టు ఉండటం. ఈ ఆక్రోశము చాలా కాలం ఉండిపోతే, అది వ్యధగా మారుతుంది. వ్యధ అంటే, భూతకాలంలో జరిగిన ఏదేని ఒక సంఘటనతో అనుసంధానమై, పదేపదే ‘నాపట్ల వారు ఇలా చేసారు’ అనే దాని గురించే ఆలోచిస్తూ దానిని మనస్సులోనే ఉంచుకున్న, ఒక తీవ్రమైన, ప్రతికూల భావోద్వేగము. ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు అనేదేమిటంటే, అహంకారముచే సృష్టించబడిన, మోహ భ్రాంతి వలలోనే ఉండాలని నిర్ణయించుకున్న ఆసురీ ప్రవృత్తి మనుష్యులు, ఎన్నెన్నో నీచమైన అలోచనలచే సతమతమై పోతుంటారు. అందువలన, వారి భవిష్యత్తుని చీకటి చేసుకుంటారు.

మానవులు తమ స్వంతచిత్తముతో కర్మలు చేయటానికి వారికి పూర్తి స్వేచ్ఛ ఉన్నది, కానీ వారు చేసిన కర్మల యొక్క ఫలితములు వారే నిర్ణయించుకునే అధికారం లేదు. కర్మసిద్ధాంతమును అనుసరించి కర్మఫలములను ఆ భగవంతుడే వారికి ప్రసాదిస్తాడు. రామాయణము ఇలా పేర్కొంటున్నది:

కరమ ప్రధాన బిస్వ కరి రాఖా,

జో జస కరఇ సో తస ఫల ఛాఖా

‘ఈ జగత్తులో కర్మలు ప్రధానమైనవి. జనులు ఏ కార్యములు చేసినా వాటి ఫలములను అనుభవిస్తారు.’

పర్యవసానంగా, తాము చేసిన కర్మల ప్రతిక్రియలను ప్రతిఒక్కరూ ఎదుర్కోవాల్సిందే. బైబిలు కూడా ఈ విధంగా చెపుతుంది: ‘నీవు చేసుకున్న పాపం నిన్ను తప్పకుండా వెతికిపట్టుకుంటుంది’ (Be sure your sin will find you out. (Numbers 32.23)) .

ఆసురీ స్వభావమును ఎంచుకున్న వారిని, వారి తదుపరి జన్మలలో, భగవంతుడు నిమ్ననీచ స్థాయి జీవనం లోనికి పంపించివేస్తాడు. ఈ సూత్రం చాలా సరళమైనది:

ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః
జఘన్య గుణ వృత్తిస్థా అధో తిష్టంతి తామసాః

(గరుడ పురాణం)

‘సాత్త్విక బుద్ధితో ప్రవర్తించేవారు ఉన్నత స్థాయికి వెళతారు; రాజసిక ప్రవృత్తితో వ్యవహరించేవారు మధ్యమ స్థాయిలోనే ఉండిపోతారు; తామసిక మనస్తత్వం తో పనిచేసేవారు మరియు పాపిష్టి పనులపై మొగ్గు చూపేవారు నిమ్న స్థాయి లోకాలకు పడిపోతారు.’