Bhagavad Gita: Chapter 6, Verse 15

యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః ।
శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగఛ్చతి ।। 15 ।।

యుంజన్ — మనస్సుని భగవంతుని యందే నిమగ్నం చేసి; ఏవం — ఈ విధంగా; సదా — ఎల్లప్పుడూ; ఆత్మానం — మనస్సు; యోగీ — ఒక యోగి; నియత-మానసః — క్రమశిక్షణ కలిగిన మనస్సు కల వాడు; శాంతిం — శాంతి; నిర్వాణ — భౌతిక బంధాల నుండి విముక్తి; పరమాం — అత్యున్నత; మత్-సంస్థామ్ — నాయందే స్థితమై ఉండి; అధిగఛ్చతి — పొందును.

Translation

BG 6.15: ఈ విధంగా, నిరంతరం మనస్సుని నాయందే నిలిపిఉంచుతూ, క్రమశిక్షణ మనస్సు కలిగిన యోగి నిర్వాణమును పొందును మరియు నా యందే పరమ శాంతితో స్థితుడై ఉండును.

Commentary

ఈ ప్రపంచంలో ఎన్నో రకాల ధ్యాన పద్దతులు ఉన్నాయి. జెన్ పద్దతులు, బౌద్ధ పద్దతులు, తాంత్రిక పద్దతులు, టావో పద్దతులు, వైదిక పద్దతులు మొదలగునవి. వీటన్నిట్లో మరల ఉప-శాఖలు ఉన్నాయి. హిందూ ధర్మాన్ని పాటించేవారిలోనే అనేకానేక రకాల పద్దతులు పాటిస్తున్నారు. క్లిష్టమైన సమస్యేమిటంటే, మన వ్యక్తిగత అభ్యాసం కోసము వీటిలో మనం ఏది పాటించాలి? అని నిర్ణయించుకోవటం. శ్రీ కృష్ణుడు ఈ చిక్కు ప్రశ్నకు సులువైన సమాధానం సూచిస్తున్నాడు. ధ్యాన విషయం భగవంతుడే ఉండాలి మరియు భగవంతుడు మాత్రమే ఉండాలని చెప్తున్నాడు.

ధ్యానము యొక్క లక్ష్యము కేవలం ఏకాగ్రతను పెంపొందించుకోవటమే కాదు, మనస్సుని పరిశుద్ధి చేసుకోవటం కూడా. శ్వాస, చక్రాలు, శూన్యం, దీపం వంటి వాటిపై ధ్యానం ఎకాగ్రతను పెంచుకోవటానికి దోహదపడవచ్చు. కానీ, మనస్సుని పరిశుద్ధి చేసుకోవటానికి ఖచ్చితంగా మనస్సుని సంపూర్ణ పరిశుద్దుడైన భగవంతును యందు నిలిపితేనే సాధ్యం. భగవంతుడు ప్రకృతి త్రిగుణముల కన్నా అతీతుడని 14.26వ శ్లోకంలో పేర్కొనబడినది, కాబట్టి, ఎవరైతే ఆయనపై మనస్సుని నిమగ్నం చేస్తారో వారి మనస్సు కూడా త్రిగుణముల కంటే అతీతంగా అవుతుంది. ఈ విధంగా, 'ప్రాణము' లపై ధ్యానం అలౌకికమైనదని అభ్యాసకులు అనవచ్చు కానీ నిజమైన అలౌకిక ధ్యానం అనేది భగవంతుని పట్ల చేసేదే ఉంటుంది.

మరైతే, భగవంతునిపైనే మనస్సు నిలిపే మార్గం ఏమిటి? మనము భగవంతుని దివ్య లక్షణములైన అన్ని - నామములు, రూపములు, గుణములు, లీలలు, ధామములు, పరివారము - వీటిపై ధ్యానం చేయవచ్చు. ఇవన్నీ భగవంతుని కన్నా అభేదము మరియు ఆయన సర్వ శక్తులను కలిగి ఉన్నాయి. కాబట్టి, భక్తులు వీటిలో దేనిపైనైనా ధ్యానం చేసుకుని, భగవంతునిపై ధ్యానం చేసిన ఫలితాన్ని పొందవచ్చు. భారతదేశంలో, చాలా భక్తి మార్గాల్లో భగవన్నామమే ధ్యానానికి ఆధారంగా చేయబడింది. ఈ విధంగా రామాయణం (రామచరితమానస్) ఇలా పేర్కొంటున్నది:

బ్రహ్మ రామ తేఁ నాము బడ, బర దాయక బర దాని

‘జీవాత్మలకు ప్రయోజనకారిగా ఉండటంలో, భగవంతుని నామము భగవంతుని కన్నా గొప్పది.’ నామ ఉచ్చారణ అనేది భగవంతున్ని గుర్తుంచుకోవటానికి అత్యంత అనుకూలమైన పద్దతి, ఎందుకంటే దీనిని ఎక్కడైనా, ఎప్పుడైనా చేయవచ్చు - నడిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు, కూర్చున్నప్పుడు, తినేటప్పుడు, ఇంకా ఏ ఇతర పని చేస్తున్నప్పుడైనా.

కానీ, చాలామంది సాధకులకు, కేవలం భగవత్ నామము మాత్రమే, మనస్సుని రంజిల్ల చేయటానికి తగినంత ఆకర్షణ కలుగచేయదు. అనంతమైన జన్మల సంస్కారముల వలన మనస్సు సహజంగానే స్వరూపముల వైపు ఆకర్షితమవుతుంది. భగవత్ రూపము ఆధారంగా చేసుకుంటే, ధ్యానమనేది సహజంగా, సులువుగా ఉంటుంది. దీనినే 'రూప ధ్యానము' అంటారు.

ఒకసారి మనస్సు భగవత్ రూపంపై కేంద్రీకృతమయితే, మనము దాన్ని, దేవుని గుణముల పై - అయన దయ, ఆయన సౌందర్యం, ఆయన జ్ఞానం, ఆయన ప్రేమ, ఆయన ఉదారత, ఆయన కృప, ఇంకా ఎన్నో... – వీటిపై చింతన చేయటం ద్వారా - మరింత ఇనుమడింపచేయవచ్చు. ఆ తర్వాత మానసిక సేవ చేయటం ద్వారా ధ్యానంలో మరింత పురోగతి సాధించవచ్చు. ఆయనకు ఆహార పదార్థములు సమర్పించినట్టు, అర్చన చేసినట్టు, ఆయనకు పాటలు పాడినట్టు, పాద సేవ చేసినట్టు, విసనకర్ర వీచినట్టు, స్నానం చేపించినట్టు, ఆయనకై వంట చేసినట్టు ఇలా భావన చేయవచ్చు. దీనిని 'మానసీ సేవా' (మనసులో భగవంతుని సేవ చేయటం) అంటారు. ఈ రకంగా, మనం భగవంతుని నామాలు, రూపాలు, గుణములు, లీలలు మొదలైన వాటిపై ధ్యానం చేయవచ్చు. ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ భగవంతుని యందే మనస్సుని నిమగ్నం చేయటానికి, శ్రీ కృష్ణుడు చెప్పిన ఉపదేశం పాటించటానికి ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన ఉపకరణములే.

ఈ శ్లోకం చివరన, శ్రీ కృష్ణుడు, ధ్యానం యొక్క అత్యున్నత ప్రయోజనం ఇస్తున్నాడు, అవే, మాయా నివృత్తి, మరియు శాశ్వత ఆనందాన్ని ఇచ్చే భగవత్ ప్రాప్తి.