Bhagavad Gita: Chapter 6, Verse 24-25

సంకల్పప్రభవాన్కామాన్ త్యక్త్వా సర్వానశేషతః ।
మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః ।। 24 ।।
శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ।
ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ ।। 25 ।।

సంకల్ప — సంకల్పముతో; ప్రభవాన్ — జనించిన; కామాన్ — కోరికలు; త్యక్త్వా — విడిచిపెట్టిన పిదప; సర్వాన్ — అన్నీ; అశేషతః — సంపూర్ణముగా; మనసా — మనస్సు ద్వారా; ఏవ — నిజముగా; ఇంద్రియ-గ్రామం — ఇంద్రియ సముదాయము; వినియమ్య — నిగ్రహించి; సమంతతః — అన్ని వైపులనుండీ; శనైః — క్రమముగా;శనైః — క్రమముగా; ఉపరమేత్ — శాంతిని పొందును; బుద్ధ్యా — బుద్ధి చేత; ధృతి-గృహీతయా — శాస్త్ర సమ్మతమైన పద్దతిలో దృఢ సంకల్పంచే సాధించి; ఆత్మ-సంస్థం — భగవంతుని యందే నిలిపి; మనః — మనస్సు; కృత్వా — చేసిన తర్వాత; న, కించిత్, అపి, చింతయేత్ — వేటినీ కూడా స్మరింపరాదు.

Translation

BG 6.24-25: ప్రాపంచిక తలంపుల నుండి జనించిన అన్ని కోరికలను త్యజించి, ఇంద్రియములను అన్ని వైపులనుండీ మనస్సుతో నిగ్రహించవలెను. క్రమక్రమముగా మరియు నిశ్చయముగా, బుద్ధియందు దృఢవిశ్వాసంతో మనస్సు భగవంతుని యందే స్థితమగును, మరియు మరే ఇతరమైన వాటి గురించి ఇక ఆలోచించదు.

Commentary

ధ్యానానికి రెండు ప్రక్రియలు అవసరం – మనస్సుని ప్రాపంచిక జగత్తు నుండి వేరుచేయటం, మరియు దాన్నిభగవంతుని యందే స్థిరపరచటం. ఇక్కడ, శ్రీ కృష్ణుడు మొదటి భాగాన్ని వివరించంతో మొదలు పెడుతున్నాడు – అంటే మనస్సుని ప్రపంచం నుండి దూరం చేయటం.

మనస్సుకి ప్రపంచం పట్ల మమకారాసక్తి ఉన్నప్పుడు, ప్రాపంచిక వస్తువులు, మనుష్యులు, సంఘటనలు వంటివాటి తలంపులు మనస్సులోకి వస్తూనే ఉంటాయి. ప్రారంభంలో, తలంపులు ‘స్ఫూర్ణా’ రూపంలో ఉంటాయి (అప్పుడప్పుడూ వచ్చిపోయే అనుభూతులు మరియు ఆలోచనలు). మనము ఈ యొక్క ‘స్ఫూర్ణా’ ములను జరగాలి/కావాలి అని గట్టిగా కోరుకున్నప్పుడు, అది ‘సంకల్పము’ అవుతుంది. ఈ విధంగా, ఆలోచనలు, అవి అనుకూలమైనవో లేదా ప్రతికూలమైనవో అన్నదాన్ని బట్టి, సంకల్పముగా (ఆయా వస్తు విషయాల కోసం పాటు పడటం) మరియు వికల్పములగా (వాటిని ద్వేషించటం) మారతాయి. ఈ సంకల్ప వికల్ప బీజములు, కోరికలనే మొక్కగా మారతాయి, ‘ఇలా అవ్వాలి. ఇలా అవ్వకూడదు’ అని. కెమెరా ఫిల్ము పై కాంతి పడ్డప్పుడు అయినట్టు, ఈ రెండూ సంకల్ప వికల్పములు మనస్సు పై తక్షణమే వాటి ముద్ర వేస్తాయి. ఈ విధంగా అవి నేరుగా భగవంతునిపై ధ్యానానికి అవరోధం కలిగిస్తాయి. వాటికి ఆకస్మికంగా ఎగిసిపడే స్వభావం కూడా ఉంటుంది, ఈనాటి చిన్న కోరికే కాలక్రమంలో మహా జ్వాలగా పరిణమించే అవకాశం ఉంది. ఈ విధంగా, ధ్యానంలో విజయం/సాఫల్యత పొందాలనే అభిలాష ఉంటే భౌతిక వస్తు-విషయముల పట్ల ఆసక్తి విడిచిపెట్టాలి.

ధ్యానం యొక్క మొదటి భాగం – ప్రాపంచికత నుండి మనస్సుని తీసివేయమని - వివరించిన శ్రీ కృష్ణుడు, ఇక రెండవ భాగం గురించి వివరిస్తున్నాడు. మనస్సుని భగవంతుని యందే లగ్నం చేయాలి. ఇది దానంతట అదే అయిపోదు, ధృడ సంకల్పముతో శ్రమిస్తే, విజయం నెమ్మదిగా చేకూరుతుంది, అని అంటున్నాడు.

వేద శాస్త్రాలకు అనుగుణంగా ఉన్న ధృడ సంకల్పాన్ని ‘ధృతి’ అంటారు. ఈ దృఢ సంకల్పము, బుద్ధి యొక్క గట్టి విశ్వాసం ద్వారా వస్తుంది. చాలా మంది ప్రజలు, ఆత్మతత్త్వం గురించి, ప్రాపంచిక పరుగుల నిరర్థకత్వము గురించి వేదశాస్త్రాల పుస్తక జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. కానీ, వారి దైనందిన జీవితం వారి జ్ఞానానికి అనుగుణంగా ఉండదు, అంతేకాక పాపిష్ఠి పనులు, లైంగిక వాంఛలు, మరియు మత్తుపదార్థాల సేవనం లాంటి పనులు చేస్తుంటారు. ఇది ఎందుకంటే వారి బుద్ధి, ఈ శాస్త్ర విషయాల మీద నమ్మకం/విశ్వాసం కలిగి ఉండదు. ఈ ప్రపంచం యొక్క అశాశ్వతత్వం మరియు భగవంతునితో తనకు ఉన్న శాశ్వత సంబధముల మీద బుద్ధి దృఢవిశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఈ విచక్షణా శక్తి వస్తుంది. ఈ విధంగా బుద్ధిని ఉపయోగించుకుని క్రమక్రమంగా ఇంద్రియ భోగములను త్యజించాలి. దీనినే ప్రత్యాహారము అంటారు, అంటే ఇంద్రియ వస్తు-విషయముల వైపు మనస్సు పరుగు తీయటాన్ని నిగ్రహించటం. ప్రత్యాహరములో సాఫల్యం తక్షణమే రాదు. అది పదే పదే అభ్యాసం చేయటం ద్వారా క్రమక్రమంగా సాధించబడుతుంది. శ్రీ కృష్ణుడు తదుపరి ఈ అభ్యాసం అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాడు.