Bhagavad Gita: Chapter 13, Verse 32

అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః ।
శరీరస్థోఽపి కౌంతేయ న కరోతి న లిప్యతే ।। 32 ।।

అనాదిత్వాత్ — అనాది అయినది; నిర్గుణత్వాత్ — ఎటువంటి భౌతిక గుణములు లేకుండా; పరమ-ఆత్మా — పరమాత్మ; అయం — ఇది; అవ్యయః — నాశరహితుడు; శరీర-స్థ — శరీరములో నివసిస్తూ; అపి — అయినా సరే; కౌంతేయ — అర్జునా, కుంతీ దేవి తనయుడా; న కరోతి — ఏమీ చేయడు; న లిప్యతే — ఏమీ అంటదు.

Translation

BG 13.32: ఓ కుంతీ తనయుడా, పరమాత్మ నాశములేనిది, అనాదియైనది, భౌతిక లక్షణములు ఏవీ లేనిది. దేహములోనే స్థితమై ఉన్నా, అది ఏమీ చేయదు, మరియు, భౌతిక శక్తి చే ఏమాత్రం కళంకితము కాదు.

Commentary

సమస్త ప్రాణుల హృదయములలో పరమాత్మగా స్థితమై ఉన్న భగవంతుడు, ఎప్పుడూ శరీరముతో అనుసంధానం కాడు, లేదా దేహము యొక్క స్థితిగతులచే ప్రభావితం కాడు. భౌతిక శరీరంలో ఉన్నంత మాత్రాన, ఆయన ఏ కోశానా భౌతిక పరంగా అవ్వడు, ఆయన కర్మ సిద్ధాంతమునకు అతీతుడు మరియు జనన మరణ చక్రమునకు లోబడి ఉండడు, కానీ ఇవి జీవాత్మకు అనుభవంలోకి వస్తాయి.