Bhagavad Gita: Chapter 14, Verse 6

తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయమ్ ।
సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ ।। 6 ।।

తత్ర — వీటిలో; సత్త్వం — సత్త్వ గుణము; నిర్మలత్వాత్ — అతి పవిత్రమైనది కావున; ప్రకాశకం — ప్రకాశవంతమయినది; అనామయమ్ — ఆరోగ్యవంతమయినది మరియు క్షేమదాయకమైనది; సుఖ — సుఖము; సంగేన — మమకారాసక్తి; బధ్నాతి — బంధించివేయును; జ్ఞాన — జ్ఞానము; సంగేన — మమకారాసక్తి; చ — మరియు; అనఘ — అర్జునా, పాపరహితుడా.

Translation

BG 14.6: వీటిలో సత్త్వ గుణము మిగతావాటి కంటే పవిత్రమైనది కావుటచే, ఇది ప్రకాశకమైనది మరియు చాలా క్షేమదాయకమైనది. ఓ పాపరహితుడా, సుఖానుభవము మరియు జ్ఞానము పట్ల ఆసక్తి వలన అది జీవాత్మను బంధించివేస్తుంది.

Commentary

ప్రకాశకం అంటే ‘ప్రకాశింపచేసేది’ అని అర్థం. అనామయం అంటే ‘ఆరోగ్యవంతము మరియు సంపూర్ణ క్షేమదాయకము’ అని అర్థం; దీనినే పొడిగింపుగా, బాధ, అసౌకర్యము, మరియు దుఃఖములు ఏవీ లేకుండా, ‘ప్రశాంత స్వభావము’ అని కూడా అనవచ్చు. సత్త్వ గుణము నిర్మలమైనది మరియు ప్రకాశింపచేసేది. ఈ విధంగా, సత్త్వ గుణము అనేది మనిషి యొక్క వ్యక్తిత్వములో సద్గుణమును పెంపొందించి, బుద్ధిని జ్ఞానముచే ప్రకాశింపచేయును. అది వ్యక్తిని నిర్మలంగా, తృప్తితో, దానగుణముతో, కారుణ్యంతో, సహాయకారిగా, స్థిమితముగా, మరియు ప్రశాంతముగా చేస్తుంది. అది చక్కటి ఆరోగ్యమును మరియు వ్యాధుల నుండి విముక్తినీ ఇస్తుంది. సత్త్వ గుణము ప్రశాంతతను మరియు సుఖమును ఇస్తుంది కానీ, వీటి పట్ల మమకారాసక్తియే ఆత్మను భౌతిక ప్రకృతికి కట్టివేస్తుంది.

దీనిని ఒక ఉదాహరణ ద్వారా అర్థంచేసుకుందాం. ఒక బాటసారి అడవి గుండా ప్రయాణిస్తున్నప్పుడు ముగ్గురు బందిపోటు దొంగలు దాడిచేశారు. మొదటి వాడు, ‘వీడిని చంపేసి వాడి సొమ్మంతా దోచేద్దాం’ అన్నాడు. రెండవ వాడు, ‘వద్దు, వాడిని చంపొద్దు, కేవలం కట్టిపడేసి వాడి దగ్గర ఉన్నవి అంతా తీసుకెళ్లిపోదాం’ అన్నాడు. ఆ రెండవ దొంగ చెప్పిన సలహా ప్రకారం, బాటసారిని కట్టేసి అతని సొమ్మంతా దోచుకున్నారు. వారు కొంత దూరం వెళ్ళిపోయిన తరువాత, మూడవ దొంగ తిరిగొచ్చాడు. వాడు ఆ బాటసారి కట్లు ఇప్పేసి, అడవి చివర వరకూ తీసుకువెళ్లి , బయటకి దారి చూపించి, ఇలా అన్నాడు ‘నేను బయటకురాలేను, కానీ నీవు ఈ మార్గంలో వెళ్తే అడవి బయటకు వెళ్లగలవు.’ అని.

ఈ ఉదాహరణలో, మొదటి బందిపోటు తమో-గుణము. అది ఆత్మను, సోమరితనం, నిర్లక్ష్యము మరియు అజ్ఞానంతో నిజంగానే చంపటానికి ప్రయత్నిస్తుంది. రెండవ బందిపోటు, రజో-గుణము, అది ప్రాణులలో ఆవేశఉద్వేగాలను జనింప చేస్తుంది, మరియు ఆత్మను అసంఖ్యాకమైన ప్రాపంచిక కోరికలతో బంధించివేస్తుంది. మూడవ బందిపోటు, సత్త్వ గుణము, అది జీవుల దుష్టగుణములను తగ్గిస్తుంది, భౌతిక అసౌఖ్యమును తగ్గిస్తుంది మరియు ఆత్మను సంక్షేమ మార్గంలో పెడుతుంది. అయినా , సత్త్వ గుణము కూడా భౌతిక ప్రకృతి యొక్క పరిధి లోనే ఉన్నది. మనము దాని పట్ల మమకారాసక్తి తో ఉండకూడదు; పైగా, అలౌకిక స్థాయికి చేరుకోవటానికి దానిని ఒక మెట్టుగా ఉపయోగించుకోవాలి.

ఈ మూడింటికి అతీతముగా, శుద్ధ-సత్త్వ గుణము ఉంటుంది, ఇది అలౌకిక సత్త్వ గుణము. అది భౌతిక శక్తికి అతీతమైన భగవంతుని యొక్క దివ్యమైన శక్తి యొక్క గుణము. ఎప్పుడైతే ఆత్మ భగవత్ ప్రాప్తి పొందుతుందో, ఆయన యొక్క కృపచే, భగవంతుడు ఆ జీవాత్మకు శుద్ధ సత్వమును ప్రసాదిస్తాడు, దానితో ఆయొక్క ఇంద్రియమనోబుద్ధులు దివ్యమైనవిగా అవుతాయి.