Bhagavad Gita: Chapter 3, Verse 15

కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముధ్భవమ్ ।
తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ ।। 15 ।।

కర్మ — కర్తవ్యములు; బ్రహ్మ — వేదములలో; ఉద్భవం — ప్రకటితమయ్యెను; విద్ధి — తెలుసుకొనుము; బ్రహ్మా — వేదములు; అక్షర — నాశము కాని వాని నుండి (భగవంతుడు); సముధ్భవమ్ — నేరుగా వ్యక్త మయ్యెను; తస్మాత్ — కాబట్టి; సర్వ-గతం — సర్వ వ్యాపి అయిన; బ్రహ్మ — భగవంతుడు; నిత్యం — ఎల్లప్పుడూ; యజ్ఞే — యజ్ఞము యందే; ప్రతిష్ఠితమ్ — ప్రతిష్ఠితుడై ఉండును.

Translation

BG 3.15: మానవుల విహిత కర్మలు (కర్తవ్యములు) వేదములలో చెప్పబడ్డాయి, మరియు వేదములు స్వయంగా ఆ భగవంతుని నుండే వ్యక్తమయ్యాయి. కాబట్టి, సర్వ-వ్యాపియైన భగవంతుడు నిత్యము యజ్ఞ కార్యములలో స్థితుడై ఉంటాడు.

Commentary

వేదములు భగవంతుని శ్వాస నుండి వెలువడ్డాయి: అస్య మహతో భూతస్య నిఃశ్వసితమేతద్యదృగ్వేదో యజుర్వేదః సామవేదో అథర్వాంగిరసః (బృహదారణ్యక ఉపనిషత్తు 4.5.11). ‘నాలుగు వేదములు - ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము - అన్నీ సర్వోత్కృష్ట భగవంతుని శ్వాస నుండి వెలువడ్డాయి.’ ఈ సనాతనమైన వేదములలో, మనుష్యుల విధులను ఆ భగవంతుడే స్వయంగా వివరించాడు. ఈ విధులు, ఏ విధంగా తయారుచేయబడ్డాయంటే వాటిని నిర్వర్తించడం ద్వారా ప్రాపంచికంగా కూరుకుపోయిన మనుష్యులు నెమ్మదిగా తమ వాంఛలను నియంత్రణ చేసుకుని, తమని తాము - తమో గుణం నుండి రజో గుణానికి, రజో గుణం నుండి సత్త్వ గుణానికి - ఉద్ధరించుకోవటం నేర్చుకోవచ్చు. ఈ విధులు యజ్ఞంలాగా ఆయనకే అంకితం చేయమని నిర్దేశింపబడ్డాయి. కాబట్టి, భగవంతుని అర్పితముగా పవిత్రం చేయబడిన విధులు, దైవికంగా, భగవత్ సంబంధముగా ఉండి, భగవంతునితో అభేదంగా ఉంటాయి.

యజ్ఞం అంటే స్వయంగా భగవంతుడే అని తంత్ర సారము, పేర్కొంటున్నది:

యజ్ఞో యజ్ఞ పుమాంశ్చైవ యజ్ఞాశో యజ్ఞ యజ్ఞభావనః
యజ్ఞభుక్ చేతి పంచాత్మా యజ్ఞేశ్విజ్యో హరిః స్వయం

భాగవతం (11.19.39)లో శ్రీ కృష్ణుడు ఉద్ధవునితో ఇలా అంటాడు: యజ్ఞోఽహం భగవత్తమః, ‘నేను, వసుదేవుని పుత్రుడను, నేనే యజ్ఞమును.’ వేదములు ఇలా చెప్తున్నాయి: యజ్ఞో వై విష్ణుః ‘యజ్ఞం అంటే స్వయంగా విష్ణు మూర్తియే.’ ఈ సూత్రాన్ని పునరుద్ఘాటిస్తూ, ‘భగవంతుడు ఎల్లప్పుడూ యజ్ఞ క్రియ లోనే స్థితుడై ఉంటాడు’ అని శ్రీ కృష్ణుడు ఈ శ్లోకం లో చెప్తున్నాడు.