Bhagavad Gita: Chapter 9, Verse 26

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి ।
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః ।। 26 ।।

పత్రం — ఆకు; పుష్పం — పువ్వు; ఫలం — పండు; తోయం — నీరు; యః — ఎవరైతే; మే — నాకు; భక్త్యా — భక్తితో; ప్రయచ్ఛతి — సమర్పిస్తారో; తత్ — అది; అహం — నేను; భక్తి-ఉపహృతం — భక్తితో సమర్పించబడినట్టి; అశ్నామి — ఆరగింతును; ప్రయత-ఆత్మనః — పవిత్రమైన మనస్సు ఉన్నవ్యక్తి.

Translation

BG 9.26: నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేదా నీరైనా గాని సమర్పిస్తే, ఆ స్వచ్ఛమైన మనస్సుగల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని, నేను సంతోషంగా ఆరగిస్తాను.

Commentary

పరమేశ్వరుడిని ఆరాధించటం వలన కలిగే ప్రయోజనాలను వివరించిన పిదప, శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు, అది ఎంత సులువైనదో వివరిస్తున్నాడు. దేవతల మరియు పితృదేవతల ఆరాధనలో, వారిని ప్రసన్నం చేయటానికి నిష్ఠగా ఆచరించవలసిన ఎన్నో నియమాలు ఉంటాయి. కానీ, భగవంతుడు తనకు ప్రేమ నిండిన హృదయంతో సమర్పించబడిన దాన్ని ఏదైనా స్వీకరిస్తాడు. మీ దగ్గర కేవలం ఒక పండు ఉంటే అది సమర్పించండి, భగవంతుడు సంతోషిస్తాడు. ఒకవేళ పండు లేకపోతే ఒక పువ్వు సమర్పించండి. అది పుష్పించే కాలం కాకపొతే భగవంతునికి కేవలం ఒక ఆకు సమర్పించండి; ప్రేమతో ఇచ్చినప్పుడు అది కూడా సరిపోతుంది. ఒకవేళ ఆకులు కూడా దొరకకపోతే, అంతటా లభ్యమయ్యే నీటిని సమర్పించండి, కానీ ఇక్కడ కూడా అది ప్రేమ/భక్తితో ఇవ్వబడాలి. భక్త్యా అన్న పదం ఇక్కడ మొదటి మరియు రెండవ శ్లోకపాదాల్లో రెంటిలో వాడబడింది. ఆరాధించే వాని (భక్తుని) యొక్క భక్తి మాత్రమే భగవంతుడిని ప్రసన్నం చేస్తుంది, ఆ సమర్పించబడిన వస్తువు యొక్క విలువ కాదు.

ఈ అద్భుతమైన ప్రకటన చేయటంతో, శ్రీ కృష్ణుడు భగవంతుని యొక్క కరుణాపూరిత స్వభావాన్ని తెలియచేస్తున్నాడు. తనకు సమర్పించబడిన వస్తువు యొక్క భౌతిక విలువ ఆయనకు అవసరం లేదు. అన్నింటికన్నా ఎక్కువగా, ఎంత ప్రేమగా ఇచ్చామో అనేదే అయనకు ముఖ్యం. ఈ విధంగా 'హరి భక్తి విలాస్' ఇలా పేర్కొంటుంది:

తులసీ దళ మాత్రేణ జలస్య చులుకేన చ
విక్రీణీతే స్వం ఆత్మానం భక్తేభ్యో భక్త-వత్సలః (11.261)

‘భగవంతునికి నిజమైన ప్రేమతో, ఒక తులసి ఆకు మరియు మీ దోసిట్లో పట్టేంత నీరు సమర్పిస్తే, బదులుగా ఆయన తననే మీకు సమర్పించుకుంటాడు, ఎందుకంటే ఆయన ప్రేమకు వశమైపోతాడు.’ అఖిలాండకోటిబ్రహ్మాండ నాయకుడు, అనిర్వచనీయమైన మహాద్భుత గుణములు కలవాడు, ఎవరి సంకల్ప మాత్రం చేతనే అనంతమైన బ్రహ్మాండాలు సృజించబడి, లయమై పోతుంటాయో, అలాంటి ఆయన తన భక్తునిచే నిజమైన ప్రేమతో సమర్పించబడిన అత్యల్పమైన దాన్ని కూడా స్వీకరిస్తాడు అంటే అదెంత అద్భుతమైన విషయం. ఇక్కడ 'ప్రయతాత్మనః' అన్న పదం వాడబడింది, అంటే, ‘కల్మషములేని పవిత్ర హృదయం (మనస్సు) తో ఉన్న వారు సమర్పించే దానిని స్వీకరిస్తాను’ అని. శ్రీమద్భాగవతంలో కూడా సరిగ్గా ఇదే భగవద్గీత శ్లోకం ఉంది. సుదాముని ఇంట్లో అటుకులు తినేటప్పుడు, శ్రీ కృష్ణుడు ఇలా అన్నాడు:

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః (10.81.4)

‘నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేదా నీరైనా గాని సమర్పిస్తే, ఆ స్వచ్ఛమైన మనస్సుగల భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను సంతోషంగా ఆరగిస్తాను.’

భగవంతుడు ఈ భూలోకంలో అవతరించినప్పుడల్లా, తన దివ్య లీలలలో ఈ గుణమును ప్రదర్శిస్తాడు. మహాభారత యుద్ధం ముందు, శ్రీ కృష్ణుడు, కౌరవులు, పాండవుల మధ్య సంధి కుదిర్చే ప్రయంత్నంలో హస్తినాపురం వెళ్లినప్పుడు, దుష్టుడైన దుర్యోధనుడు గర్వంతో యాభై-ఆరు విభిన్న వంటకాలతో విందు ఏర్పాటు చేసాడు. కానీ, శ్రీ కృష్ణుడు ఆ ఆతిథ్యం తిరస్కరించి, ఒక సామాన్యమైన విదురాని కుటీరానికి వెళ్ళాడు, ఆమె ఎప్పటినుండో తన ఇష్టదైవాన్ని సేవించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తోంది. కృష్ణుడు ఇంటికి రావటంతో విదురాని అమితంగా సంతోషపడింది. ఆమె దగ్గర ఇవ్వటానికి కేవలం అరటి పండ్లే ఉన్నాయి, కానీ ప్రేమభావనలో ఆమె బుద్ధి ఎంతగా అయోమయం అయిపోయిందంటే, ఆమె పండు పడేసి, తొక్కలు ఆయనకు తినిపించింది కూడా తెలియలేదు. ఐనప్పటికీ, ఆమె భక్తిని చూసిన శ్రీ కృష్ణుడు, ప్రపంచంలో అదే అత్యంత రుచికరమైనదన్నట్టు, పరమానందంతో ఆ తొక్కలు తిన్నాడు.