Bhagavad Gita: Chapter 10, Verse 32

సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున ।
అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్ ।। 32 ।।

సర్గాణామ్ — సమస్త సృష్టిలో; ఆదిః — మొదలు (ఆది); అంతః — చివర; చ — మరియు; మధ్యం — మధ్య; చ — మరియు; ఏవ — నిజముగా; అహం — నేను; అర్జున — అర్జునా; అధ్యాత్మ విద్యా — ఆధ్యాత్మిక విద్య; విద్యానాం — విద్యలలో; వాదః — తర్కబద్ధ నిర్ణయము; ప్రవదతామ్ — వాదన లో; అహం — నేను.

Translation

BG 10.32: ఓ అర్జునా, నేనే సమస్త సృష్టికి ఆది, మధ్య, మరియు అంతము అని తెలుసుకొనుము. విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యని, మరియు సంవాదములలో తర్కబద్ధ నిర్ణయమును నేనే.

Commentary

ఇంతకు క్రితం 20వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు తానే సర్వ ప్రాణుల ఆది, మధ్యము, మరియు అంతము అని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు, అదే విషయాన్ని సమస్త సృష్టికి చెప్తున్నాడు: ‘సృష్టి చేయబడినది అంతా - ఆకాశము, గాలి, అగ్ని, నీరు, మరియు భూమి కలిపి సర్గ అంటారు. నేనే వీటన్నిటికీ సృష్టికర్త (ఆది), స్థితికర్త (మధ్య), మరియు లయకర్తను (అంతము). కాబట్టి, సృష్టి, స్థితి, మరియు లయ ప్రక్రియలపై, అవి నా విభూతులుగా ధ్యానం చేయవచ్చు.

విద్యా అనేది ఒక వ్యక్తి సంపాదించుకునే శాస్త్రపరమైన జ్ఞానము. శాస్త్రములు పద్దెనిమిది రకముల విద్యలను విశదీకరించాయి. వాటిలో, ప్రాధానమైనవి పద్నాలుగు:

అంగాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయ విస్తరః.
పురాణం ధర్మశాస్త్రం చ విద్యాహ్యేతాశ్చతుర్దశ
ఆయుర్వేదో ధనుర్వేదో గాంధర్వశ్చైవ తే త్రయః
అర్థశాస్త్రం చతుర్థం తు విద్యా హ్యష్టాదశైవ తాః

(విష్ణు పురాణం 3.6.27-28)

‘శిక్షా, కల్ప, వ్యాకరణం, నిరుక్తి, జ్యోతిషం, ఛందస్సు - ఈ ఆరింటిని వేదాంగములు (వేదముల యొక్క అంగములు) అంటారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము - ఇవి నాలుగు వేద శాఖలు. మీమాంస, న్యాయ, ధర్మ శాస్త్రములు, మరియు పురాణములు కలిపి మొత్తం పద్నాలుగు ప్రధాన విద్యలు.’ ఈ విద్యలు అధ్యయనం చేయటం బుద్ధిని పెంపొందించి, జ్ఞానాన్ని వృద్ధి చేసి మరియు ధర్మ మార్గ అవగాహన పెంచుతాయి. అంతేకాక, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనుష్యులను భౌతిక ప్రాపంచిక బంధాలనుండి విముక్తి చేసి వారికి అమరత్వం ప్రసాదిస్తుంది. ఈ విధంగా, ఇది ఇంతకు ముందు చెప్పిన విద్యల కంటే ఉన్నతమైనది. ఇదే విషయం శ్రీ మద్భాగవతంలో కూడా చెప్పబడింది: సా విద్యా తన్మతిర్యయా (4.29.49వ శ్లోకం) ‘భగవంతుని పాదారవిందముల పట్ల బుద్ధికి అనురక్తిని కలిగించేదే అత్యుత్తమ విద్య.’

వాదోపవాదములు మరియు తర్కములో, జల్ప అంటే, తన అభిప్రాయం స్థిరపరచటం కోసం ఎదుటివాని యొక్క మాటలలో లోపము పట్టుకోవటం. వితండము అంటే సత్యముపై సరియైన చర్చకు అవకాశం ఇవ్వకుండా తప్పించుకుంటూ అర్థంపర్థం లేకుండా వాదించటం. వాదము అంటే చర్చకు తర్కబద్ధమైన ముగింపు ఇవ్వటం. ఆలోచనలను ఇచ్చిపుచ్చుకోవటానికి, సత్యమును స్థిరపరచటానికి తర్కమే ప్రధాన ఆధారము. మానవ సమాజంలో జ్ఞానాన్ని సునాయాసంగా పెంపొందించుకోవటానికి మరియు ఉపదేశించటానికి తర్కబద్ధమైన స్పృహయే మూలాధారం. విశ్వవ్యాప్త మైన తర్కబద్ధ సూత్రములే భగవంతుని శక్తికి నిదర్శనం.