Bhagavad Gita: Chapter 10, Verse 6

మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా ।
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః ।। 6 ।।

మహా-ఋషయా — మహర్షులు; సప్త — ఏడుగురు; పూర్వే — అంతకు పూర్వము; చత్వారః — నలుగురు; మనవః — మనువులు; తథా— మరియు; మత్ భావాః — నా నుండే ఉద్భవించారు; మానసాః — మనస్సు; జాతాః — పుట్టారు; యేషాం — వారి నుండి; లోకే — ప్రపంచములో; ఇమాః — వీరందరూ; ప్రజాః — ప్రజలు.

Translation

BG 10.6: సప్త ఋషులు, వారి పూర్వం నలుగురు మహాత్ములు, మరియు పద్నాలుగు మనువులు, వీరందరూ నా మనస్సు నుండే జన్మించారు. వారి నుండే ఈ లోకం లోని సమస్త ప్రజలు అవతరించారు.

Commentary

తానే విశ్వములోని సమస్త వస్తు విషములకు ఎలా మూల ఉత్పత్తి స్థానమో చెప్పటం ఇక్కడ శ్రీ కృష్ణుడు కొనసాగిస్తున్నాడు; ఇంతకు ముందు ఇరవై గుణస్వభావాలని పేర్కొని ఉన్నాడు; ఇప్పుడిక ఇరవై ఐదు ఉన్నత మహాత్ములను పేర్కొంటున్నాడు. వీరే – నలుగురు కుమార ఋషులు, ఏడుగురు ఋషులు, మరియు పద్నాలుగు మనువులు. తన నుండే వచ్చిన సమస్త విశ్వము యొక్క వంశపారంపర్య విధానం కూడా క్లుప్తంగా చెప్పాడు.

బ్రహ్మదేవుడు, విష్ణు మూర్తి (భౌతిక జగత్తు యొక్క నిర్వహణ బాధ్యత కోసం ఉన్న భగవంతుని స్వరూపం) యొక్క హిరణ్యగర్భ శక్తి నుండి జన్మించాడు. బ్రహ్మాగారి నుండి నలుగురు మహాత్ములు జనించారు, వారే, సనక్, సనందన్, సనత్, మరియు సనాతన్. వీరినే నలుగురు కుమారులు అంటారు. మన బ్రహ్మాండంలో ఈ నలుగురు కుమారులు బ్రహ్మ దేవునికి అందరి కంటే ముందు పుట్టిన సంతానం. వారు బ్రహ్మ దేవుని మనస్సు నుండే (అలైంగిక పద్ధతిలో) జన్మించారు కాబట్టి, వారికి తల్లి లేదు. వారు నిత్య ముక్తులైన జీవాత్మలు మరియు యోగ శాస్త్రములో నిష్ణాతులు కాబట్టి ఇతరులకు ఆధ్యాత్మిక సాధన ద్వారా మోక్షప్రాప్తికి సహాయం చేయటానికి వారికి శక్తి ఇవ్వబడింది. కుమారఋషుల తరువాత సప్త ఋషులు వచ్చారు. వీరే మారీచ, అంగీర, అత్రి, పులస్త్య, పులహ, క్రతు, మరియు వసిష్ఠులు. వీరికి మనుష్య జనాభాని పెంపొందించమనే పని ఇవ్వబడింది. ఆ తరువాత పద్నాలుగు మనువులు వచ్చారు, స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తమస, రైవత, చక్షుష, వైవస్వత, సావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్ర-పుత్ర, రోచ్య మరియు భౌత్యక. వారికి మనష్య జాతిని దేవతాలోకాల నుండి నిర్వహించే మరియు వైదిక ధర్మాన్ని నిలిపి సంరక్షించే అధికారం ఇవ్వబడింది. మనం ప్రస్తుతం ఏడవ మనువైన వైవస్వత మనువు కాలం లో ఉన్నాము. ఈ కాలాన్ని అందుకే వైవస్వత మన్వంతరము అంటారు. ఈ ప్రస్తుత కల్పంలో (బ్రహ్మ దేవుని పగలు) ఇంకా ఏడుగురు మనువులు ఉంటారు.

విశ్వమును నిర్వహించటానికి దేవ లోకాలలో చాల మంది దేవతలు ఉంటారు. వీరందరూ బ్రహ్మ యొక్క పుత్రులు, మనుమలు; బ్రహ్మ గారు విష్ణు మూర్తి నుండి పుట్టాడు, విష్ణు మూర్తి కూడా శ్రీ కృష్ణుని యొక్క అభేదమైన వ్యాప్తి స్వరూపమే. కాబట్టి, శ్రీ కృష్ణుడే అందరు మూల పురుషులకీ మూల పురుషుడు (ప్రపితామః) అని చెప్పవచ్చు.