Bhagavad Gita: Chapter 12, Verse 17

యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి ।
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్యః స మే ప్రియః ।। 17 ।।

యః — ఎవరైతే; న హృష్యతి — ఆనందపడరు; న ద్వేష్టి — నిరాశ చెందరు; న శోచతి — దుఃఖించరు; న కాంక్షతి — లాభంకోసం ఆశపడరో; శుభ-అశుభ-పరిత్యాగీ — శుభ అశుభములు పరిత్యజించి; భక్తి-మాన్ — భక్తితో నిండి; యః — ఎవరైతే; సః — ఆ వ్యక్తి ; మే — నాకు; ప్రియః — చాలా ప్రియమైన.

Translation

BG 12.17: ఎవరైతే లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా మరియు ప్రాపంచిక కష్టాల పట్ల బాధ పడకుండా ఉంటారో, ఎవరైతే నష్టం జరిగినా బాధ పడరో లేదా లాభం కోసం ప్రాకులాడరో, శుభ-అశుభ పనులను రెంటినీ త్యజిస్తారో, అటువంటి జనులు, భక్తితో నిండి ఉన్న వారు నాకు చాలా ప్రియమైనవారు.

Commentary

వారు లౌకిక సుఖముల పట్ల ఆనందించరు లేదా ప్రాపంచిక దుఃఖాల పట్ల నిరాశ చెందరు: మనం చీకటిలో ఉన్నప్పుడు ఎవరైనా దీపము చూపించి సహాయం చేస్తే, సహజంగానే మనం ఆనంద పడుతాము. తరువాత, ఎవరైనా దీపాన్ని ఆర్పేస్తే మనము ఆందోళన చెందుతాము. కానీ, అదే మనకు మధ్యాహ్న సూర్యుని క్రింద ఉన్నప్పుడు, ఎవరైనా దీపము చూపించినా లేదా ఆర్పినా మనకు ఏమీ తేడా పడదు. అదే విధముగా, భగవంతుని యొక్క భక్తులు, భగవానుని యొక్క దివ్య ప్రేమలో సంతుష్టి చెంది, ప్రాపంచిక ఆనందానికి, నిరాశకీ అతీతముగా ఎదుగుతారు.

నష్టము పట్ల శోకించరు లేదా లాభము కోసం ఆరాటపడరు: ఇటువంటి భక్తులు సంతోషకరమైన ప్రాపంచిక పరిస్థితుల కోసం ప్రాకులాడరు లేదా ప్రతికూలమైన పరిస్థితుల పట్ల శోకించరు. నారద భక్తి దర్శనం ఈవిధంగా పేర్కొంటున్నది:

యత్ప్రాప్య న కించిత్ వాంఛతి, న శోచతి, న ద్వేష్టి, న రమతే,

నోత్సాహి భవతి (5వ సూత్రము)

‘భగవంతుని పట్ల దివ్య ప్రేమని పొందిన తరువాత, భక్తులు ఆహ్లాదకర వస్తువిషయముల పట్ల యావ చూపరు లేదా వాటిని నష్టపోతే బాధపడరు. వారికి హాని చేసే వారి పట్ల ద్వేషభావముతో ఉండరు. వారికి ప్రాపంచిక సుఖముల పట్ల ఎలాంటి ఇష్టము ఉండదు. వారి యొక్క ప్రాపంచిక సామాజిక స్థాయిని పెంచుకోవాలనే ఆశ వారికి ఉండదు.’ భక్తులు భగవంతుని యొక్క ఆనందమును అనుభవిస్తూ ఉంటారు కాబట్టి, దానితో పోల్చితే ప్రాపంచిక వస్తువుల ఆనందము వారికి అత్యల్పంగా అనిపిస్తుంది.

శుభ-అశుభ కార్యములన్నిటినీ త్యజిస్తారు: భక్తులు సహజముగానే చెడు పనులు (వికర్మలు) విడిచిపెడతారు, ఎందుకంటే అవి ప్రకృతికి విరుద్ధమైనవి మరియు భగవంతునికి అప్రియమైనవి. శ్రీ కృష్ణుడు ఇక్కడ చెప్పే మంచి పనులు అంటే శాస్త్ర విహిత కర్మ కాండలు. భక్తులు చేసే ప్రతి పని కూడా అకర్మ అవుతుంది. ఎందుకంటే అవి ఏ స్వార్థ పూరిత ఉద్దేశ్యముతో చేయబడినవి కావు, మరియు అవి భగవత్ అర్పితము చేయబడినవి. అకర్మ యొక్క విషయము 4.17వ శ్లోకం నుండి 4.20వ శ్లోకం వరకు సవివరముగా విశదీకరించబడినది.

భక్తితో నిండి ఉంటారు: భక్తిమాన్ అంటే ‘భక్తితో నిండి ఉంటారు’ అని. భగవంతుని దివ్య ప్రేమ స్వభావము ఎలాంటిదంటే, అది నిత్యమూ పెరుగుతూనే ఉంటుంది. భక్తి విషయ కవులు ఇలా పేర్కొన్నారు: ప్రేమ్ మేఁ పూర్ణిమా నహీఁ, (prem meñ pūrṇimā nahīñ) ‘చంద్రుడు ఒక దశ వరకు పెరిగి మరల ఎలా క్షీణిస్తాడు, కానీ, దివ్య ప్రేమ అనేది పరిమితి లేకుండా పెరుగుతూనే ఉంటుంది.’ కాబట్టి, భక్తుని హృదయము భగవంతుని పట్ల అంతులేని ప్రేమను కలిగి ఉంటుంది. అటువంటి భక్తులు తనకు ఎంతో ప్రియమైన వారు అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.