Bhagavad Gita: Chapter 16, Verse 5

దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా ।
మా శుచః సంపదం దైవీమభిజాతోఽసి పాండవ ।। 5 ।।

దైవీ — దివ్యమైన; సంపత్ — గుణములు; విమోక్షాయ — మోక్షము దిశగా; నిబంధాయ — బంధనము దిశగా; ఆసురీ — ఆసురీ గుణములు; మతా — అని చెప్పబడును; మా శుచః — శోకించకు; సంపదం — గుణములు; దైవీమ్ — దైవీ; అభిజాతః — జన్మించినావు; అసి — నీవు; పాండవ — అర్జునా, పాండు పుత్రుడా.

Translation

BG 16.5: దైవీ గుణములు మోక్షము దిశగా తీసుకువెళతాయి, కానీ, ఆసురీ గుణములు బంధనములో చిక్కుకుపోయి ఉండటానికి కారణమౌతాయి. శోకింపకుము అర్జునా, నీవు దైవీ గుణములతోనే జన్మించినవాడవు.

Commentary

ఈ రెండు స్వభావాలను వివరించిన పిదప, శ్రీ కృష్ణుడు ఇక ఈ రెండింటి పరిణామాలను వివరిస్తున్నాడు. ఆసురీ గుణములు వ్యక్తిని జన్మ-మృత్యు సంసారానికి కట్టివేస్తాయి అని చెప్తున్నాడు. అదే సమయంలో, సాధు (దైవీ) గుణములను పెంపొందించు కోవటం, మాయా బంధనము నుండి విముక్తి పొందటానికి దోహదం చేస్తుంది.

ఆధ్యాత్మిక మార్గాన్ని విజయవంతముగా అనుసరిస్తూ, చివరి వరకూ దానిలోనే ఉండటంలో, సాధకుడు చాలా విషయాల పట్ల జాగరూకతతో ఉండాలి. గర్వము, కపటత్వము, వంటి ఒక్క ఆసురీ గుణము వ్యక్తిత్వములో ఉండిపోయినా, అది ఓటమికి కారణం కావచ్చు. అదే సమయంలో, మనము దైవీ గుణములను పెంపొందించుకోవాలి, ఎందుకంటే పవిత్ర గుణములు లేకుంటే, మన ఆధ్యాత్మిక పురోగతి మళ్లీ కుంటుపడవచ్చు. ఉదాహరణకి, మనోస్థైర్యము లేకపోతే, కష్టంగా అనిపించినప్పుడు ఈ ప్రయాణాన్ని విడిచిపెడతాము; క్షమా గుణము లేకుంటే, మనస్సు ఎప్పుడూ ద్వేష భావన తోనే ఉండిపోయి, అది భగవంతునిలో నిమగ్నమై ఉండలేదు. కానీ, శ్రీ కృష్ణ పరమాత్మ పేర్కొన్న ఈ దైవీ గుణములను పెంపొందించుకుంటే, వేగంగా పురోగతి సాధించే సామర్థ్యం మరియు మార్గంలో ఎదురయ్యే అవరోధాలను ఎదుర్కునే శక్తి పెరుగుతాయి. ఈ విధంగా, మంచి గుణములను పెంపొందించుకోవడం మరియు చెడు గుణములను నిర్మూలించుకోవటం అనేవి ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైన భాగమే. ఒక వ్యక్తిగత డైరీ వ్రాసుకోవటం అనేది మన బలహీనతలను నిర్మూలించుకోవటానికి మరియు సద్గుణములను పెంచుకోవటానికి చాలా దోహదపడుతుంది. ఎంతో మంది గొప్ప వారు, తాము విజయానికి అవసరం అనుకున్న సద్గుణములను పెంపొందించుకోవటానికి డైరీలు, నోట్స్ లు వ్రాసుకున్నారు. మహాత్మా గాంధీ మరియు బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇద్దరూ ఇటువంటి పద్ధతులు వాడినట్టు వారి స్వీయచరితములలో పేర్కొన్నారు.

మనం భగవంతుని పట్ల భక్తిని పెంపొందించుకుంటూ ఉంటే, మనం సహజంగానే కాలక్రమేణా ఈ శ్రీ కృష్ణుడు పేర్కొన్న దైవీ గుణములను ఆర్జించుకోవచ్చు అని కొందరు వాదిస్తారు. నిజానికి ఇది యదార్థమే, కానీ, మనం ప్రారంభంలోనే సంపూర్ణ భక్తితో, ఏ చెడు గుణములూ లేకుండా మొదలిడుతాము అన్నది కష్టమే. వాటిలో ఏ ఒక్కటి అయినా మన భక్తి పురోగతిలో తీవ్ర అవరోధం కలిగించవచ్చు. చాలా శాతం జనులు, భక్తిని క్రమక్రమంగా అభ్యాసం ద్వారా పెంపొందించుకోవాలి. దైవీ గుణములను పెంపొందించుకోవటం మరియు ఆసురీ గుణములను నిర్మూలించుకోవటం ద్వారా అభ్యాసములో విజయం సాధించవచ్చు. కాబట్టి, భక్తిలో మన పరిశ్రమలో భాగంగా, శ్రీ కృష్ణుడు ఈ అధ్యాయంలో చెప్పిన దైవీ గుణములను పెంపొందించుకోవటం మరియు ఆసురీ గుణములను త్యజించటం ద్వారా మనలను మనమే నిరంతరం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవటాన్ని కొనసాగిస్తూనే ఉండాలి.