Bhagavad Gita: Chapter 1, Verse 16-18

అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ।। 16 ।।
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః ।
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ।। 17 ।।
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే ।
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ।। 18 ।।

అనంత-విజయం — అనంతవిజయం అని పేరు గల శంఖము; రాజా — రాజు; కుంతీ-పుత్రః — కుంతీ దేవి పుత్రుడు; యుధిష్ఠిరః — యుధిష్ఠిరుడు; నకులః — నకులుడు; సహదేవః — సహదేవుడు; చ — మరియు; సుఘోష-మణిపుష్పకౌ — సుఘోషము, మణిపుష్పకము అను పేర్లుగల శంఖములు; కాశ్యః — కాశీ రాజు; చ — మరియు; పరమ-ఇషు-ఆసః — శ్రేష్ఠమైన విలుకాడు; శిఖండీ — శిఖండి; చ — మరియు; మహా-రథః — పదివేల సామాన్య యోధుల బలానికి ఒక్కరిగా సరితూగే యోధులు; ధృష్టద్యుమ్నః — ధృష్టద్యుమ్నుడు; విరాటః — విరాటుడు; చ — మరియు; సాత్యకిః — సాత్యకి; చ — మరియు; అపరాజితః — అజేయుడైన; ద్రుపదః — ద్రుపదుడు; ద్రౌపదేయాః — ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు; చ – మరియు; సర్వశః — అందరూ; పృథివీ-పతే — భూగోళాన్ని పాలించేవాడు; సౌభద్రః — అభిమన్యుడు, సుభద్ర కుమారుడు; చ — మరియు; మహా-బాహుః — గొప్ప బాహువులు కలవాడు; శంఖాన్ — శంఖములు; దధ్ముః — పూరించారు; పృథక్ పృథక్ — వేరు వేరుగా.

Translation

BG 1.16-18: ఓ భూమండలాన్ని పాలించేవాడా! యుధిష్ఠిర మహారాజు అనంతవిజయాన్ని పూరించాడు, నకుల సహదేవులు, సుఘోష మణిపుష్పకములను పూరించారు. గొప్ప విలుకాడైన కాశీ రాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, మరియు అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు, మరియు భుజబలము కలవాడు, సుభద్రా పుత్రుడు అయిన అభిమన్యుడు, వీరందరూ తమ తమ శంఖములను పూరించారు.

Commentary

పాండవ అన్నదమ్ముల్లో యుధిష్ఠిరుడు పెద్దవాడు. ఇక్కడ ఆయన ‘రాజా’ అని సంబోధించబడుతున్నాడు; 'రాజసూయ యజ్ఞం' చేసి, ఇతర రాజులందరి ప్రశంసలు అందుకుని అతను ఆ బిరుదుని సంపాదించుకున్నాడు. రాజ మందిరంలో వున్నా, అరణ్యవాసంలో ఉన్నా అతనిలో రాజసం, విశాల-హృదయ స్వభావం ఉట్టిపడేవి.

సంజయుడు ధృతరాష్ట్రుడిని 'పృథివీపతే' (భూగోళాన్ని పరిపాలించేవాడా) అని సంబోధిస్తున్నాడు. ఒక దేశాన్ని కాపాడటం లేదా వినాశకరమైన యుద్ధంలోకి నెట్టి వేయటం అనేది రాజు చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ సంబోధనకి ఉన్న నిగూఢ అర్థం ఏమిటంటే, ‘ఇరు సైన్యాలు యుద్ధానికి సన్నద్ధమై ఉన్నాయి. ఓ రాజా, ధృతరాష్ట్రా, నీవు ఒక్కడివే వారిని వెనుకకు పిలువగలవు. ఏమి నిర్ణయించబోతున్నావు?’ అని.

Watch Swamiji Explain This Verse