Bhagavad Gita: Chapter 1, Verse 27

తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ ।। 27 ।।
కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ ।

తాన్ — ఇవి; సమీక్ష్య — చూసిన పిదప; సః — వారు; కౌంతేయః — అర్జునుడు; కుంతీ పుత్రుడు; సర్వాన్ — అందరూ; బంధూన్ — బంధువులు; అవస్థితాన్ — ఉన్నటువంటి; కృపయా — కరుణతో; పరయా — మిక్కిలి; ఆవిష్టః — కూడినవాడై; విషీదన్ — మిక్కిలి విచారం; ఇదం — ఈ విధంగా; అబ్రవీత్ — పలికెను.

Translation

BG 1.27: అక్కడున్న తన బంధువులందరినీ చూసిన కుంతీ పుత్రుడు అర్జునుడు, కారుణ్య భావం ఉప్పొంగినవాడై, తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను.

Commentary

తన బంధువులందరినీ కలిపి యుద్ధభూమిలో చూడటం వలన, ఈ యొక్క భ్రాతృహత్యాపూరిత యుద్ధ పరిణామాలు, అర్జునుడి మనస్సుకి మొదటిసారి స్పష్టమైనాయి. శత్రువులను మృత్యు ద్వారాలకు పంపించేయటానికి మానసికంగా సిద్ధమై మరియు పాండవులపై జరిగిన ఎన్నో అన్యాయాలకు ప్రతీకారేచ్ఛతో సమరానికి వచ్చిన పరాక్రమవంతుడైన అర్జునుడికి అకస్మాత్తుగా మనస్సు మారిపోయింది. తోటి కురు వంశజులు శత్రు సైన్యంలో బారులు తీరి ఉండటం అతని హృదయాన్ని క్రుంగ తీసింది; అతని బుద్ధి గందరగోళానికి లోనయ్యింది, అతని శౌర్యానికి బదులుగా, తన విధి పట్ల పిరికితనం వచ్చేసింది, మరియు పరాక్రమమైన రాతి గుండె స్థానంలో మృదుహృదయత్వం చేరింది. అందుకే సంజయుడు అతని మృదుహృదయాన్ని మరియు ఆదరించే స్వభావాన్ని సూచిస్తూ, తన తల్లి కుంతీ దేవి తనయుడా అని సంబోధించాడు.

Watch Swamiji Explain This Verse