Bhagavad Gita: Chapter 1, Verse 40

కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ।
ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోఽభిభవత్యుత ।। 40 ।।

కుల-క్షయే — వంశ నాశనము వలన; ప్రణశ్యంతి — నశించిపోవును; కుల-ధర్మాః — వంశాచారములు; సనాతనాః — సనాతనమైన; (ఎంతో కాలం నుండి వున్న); ధర్మే — ధర్మము; నష్టే — అంతరించిపోవును; కులం — కుటుంబం; కృత్స్నం — సమస్తమైన; అధర్మః — అధర్మము; అభిభవతి — జయించును; ఉత — నిజముగా.

Translation

BG 1.40: వంశ నాశనం జరిగినప్పుడు, ఆ వంశాచారములన్నీ అంతరించిపోవును, మరియు మిగిలిన కుటుంబసభ్యులు అధర్మపరులగుదురు.

Commentary

కుటుంబ పెద్దలు తమ వంశము యొక్క పురాతన సాంప్రదాయాలు, ఏంతో కాలంగా ఉన్న ఆచారముల ఆధారంగా విలువలను, ఆదర్శాలను తమ ముందు తరాలవారికి అందచేస్తారు. ఈ సాంప్రదాయాలు, మానవీయ విలువలను మరియు ధార్మిక పద్ధతులను పాటించటానికి కుటుంబ సభ్యులకి దోహదపడుతాయి. కుటుంబ పెద్దలందరూ అకాలమరణం పాలయితే, వారి వచ్చే తరాల వారికి పెద్దల మార్గదర్శకత్వం, శిక్షణ లభించవు. అర్జునుడు ఈ విషయాన్ని తెలుపుతూ, వంశములు నాశనమైనప్పుడు, వాటితోపాటే ఆయా సాంప్రదాయాలు కూడా నశిస్తాయని, అప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులు ఆధార్మిక, అనైతిక అలవాట్లు పెంచుకొని, తమ ఆధ్యాత్మిక ఉద్ధరణ అవకాశాన్ని కోల్పోతారని అంటున్నాడు. ఈ విధంగా, అర్జునుడి ఉద్దేశంలో, కుటుంబ పెద్దలు ఎన్నటికి సంహరింపబడరాదు.

Watch Swamiji Explain This Verse