Bhagavad Gita: Chapter 11, Verse 3

ఏవమేతద్యథాత్థ త్వమాత్మానం పరమేశ్వర ।
ద్రష్టుమిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ ।। 3 ।।

ఏవం — ఈ విధముగా; ఏతత్ — ఇది; యథా — ఎలాగైతే; ఆత్థ — చెప్పబడినట్టు; త్వం — నీవు; ఆత్మానం — నీవే; పరమేశ్వర— పరమేశ్వరుడవు; ద్రష్టుం — చూడాలని; ఇచ్చామి — కోరుతున్నాను; తే — నీ యొక్క; రూపం — రూపము; ఐశ్వరం — దివ్యమైన; పురుష-ఉత్తమ — శ్రీ కృష్ణా, సర్వోత్కృష్ట పరమ పురుషా.

Translation

BG 11.3: ఓ ప్రభూ, నీవెవరో నీవే చెప్పినట్టు, నీవు సరిగ్గా అటువంటి దివ్య స్వరూపానివే. ఇప్పుడు నాకు, నీ యొక్క దివ్య విశ్వరూపమును చూడాలనే కోరిక కలుగుతున్నది, ఓ పురుషోత్తమా.

Commentary

అర్జునుడు శ్రీకృష్ణుడిని ‘అత్యంత గొప్ప వ్యక్తి’ అని సంబోధిస్తున్నాడు, ఎందుకంటే ఆయనతో సమానమైన వ్యక్తిత్వం ఏదీ లేదు. తరచుగా పండితులు, వారి శుష్కమైన మేధో విశ్లేషణ ఆధారంగా, భగవంతుడిని సాకార రూపంలో అంగీకరించటానికి ఒప్పుకోరు, వారు భగవంతుడిని, గుణములు, లక్షణములు, స్వభావములు, రూపములు మరియు లీలలు లేని - ఒక నిరాకార కాంతిగా మాత్రమే భావించాలని కోరుకుంటారు. అయితే, మనం సూక్ష్మమైన ఆత్మలమే ఒక రూపాన్ని కలిగి ఉన్నప్పుడు, ఆ పరమేశ్వరుడిని నిరాకారుడు అని ఎందుకు అనుకోవాలి? ఆయన వ్యక్తిత్వం మాత్రమే కాదు, అత్యుత్తమ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు కూడా. అందువల్లనే, అతను సర్వోన్నత దివ్య వ్యక్తిత్వం. మన వ్యక్తిత్వానికి మరియు భగవంతుని వ్యక్తిత్వానికి మధ్య వ్యత్యాసం ఏమిటంటే, అతను పరిపూర్ణ వ్యక్తి మాత్రమే కాదు ఆయన నిర్గుణ, నిరాకార, సర్వవ్యాప్త తత్త్వాన్ని కూడా కలిగి ఉన్నాడు.

అర్జునుడు శ్రీ కృష్ణుడి దివ్య వ్యక్తిత్వపు యథార్థమును, ఆయన చెప్పినట్టుగానే అంగీకరిస్తున్నట్టు ప్రకటిస్తున్నాడు. అర్జునుడికి ఆయన యొక్క సాకార స్వరూపముపై పూర్తి విశ్వాసము ఉంది అయినా, శ్రీ కృష్ణుడి యొక్క సర్వ ఐశ్వర్యములతో కూడిన విశ్వరూపమును చూడగోరుతున్నాడు. తన స్వంత కళ్ళతోనే దాన్ని చూడాలని అభిలషిస్తున్నాడు.