Bhagavad Gita: Chapter 11, Verse 6

పశ్యాదిత్యాన్వసూన్రుద్రానశ్వినౌ మరుతస్తథా ।
బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత ।। 6 ।।

పశ్య — తిలకించుము; ఆదిత్యాన్ — అదితి పుత్రులు (పన్నెండుగురు); వసూన్ — వసువులు (ఎనిమిది మంది); రుద్రాన్ — రుద్రులు (పదకొండుగురు); అశ్వినౌ — ఇద్దరు అశ్వినీ కుమారులు; మరుతః — మరుత్తులు (నలభైతొమ్మిది); తథా — మరియు; బహూని — చాలా; అ-దృష్ట — ఎప్పుడూ కనిపించని; పూర్వాణి — ఇంతకు క్రితం; పశ్య — తిలకించుము; ఆశ్చర్యాణి — ఆశ్చర్యము గోలిపేవి; భారత — అర్జునా, ఓ భరత వంశస్థుడా.

Translation

BG 11.6: నాలో పరికించుము ఓ భరత వంశీయుడా, (పన్నెండుగురు) అదితి పుత్రులను, (ఎనిమిది మంది) వసువులను, (పదకొండు) రుద్రులను, (ఇద్దరు) అశ్వినీ కుమారులను, అంతే కాక, (నలభైతొమ్మిది) మరుత్తులు మరియు మరెన్నెన్నో ఇంతకు పూర్వం తెలియపరచబడని అద్భుతములను కూడా చూడుము.

Commentary

భగవంతుని విశ్వ-రూపము కేవలం భూలోకంలో ఉన్న అద్భుతాలే కాక పైలోకాల్లో ఉన్న అద్భుతాలను కూడా కలిగి ఉంటుంది; ఈ విధంగా అన్నీకూడి ఉన్న స్వరూపము ఇంతకు మునుపు ఎప్పుడూ దర్శించబడలేదు. స్వర్గాది దేవతలు తన దివ్య స్వరూపము లోని అతిచిన్న భాగములే అని కూడా చెప్తున్నాడు; పన్నెండుగురు ఆదిత్యులను, ఎనిమిదిమంది వసువులను, పదకొండుగురు రుద్రులను, ఇద్దరు అశ్వినీ కుమారులను మరియు నలభైతొమ్మిది మరుత్తులను తనయందే చూపిస్తున్నాడు.

అదితి యొక్క పన్నెండుగురు పుత్రులు వీరే: ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వన, పుష, సవిత, త్వష్ట, మరియు వామన. ఎనిమిది (అష్ట) వసువులు వీరే : దార, ధ్రువ, సోమ, ఆహ, అనిల, అనల, ప్రత్యూష, మరియు ప్రభాస.

పదకొండు మంది రుద్రులు వీరే: హర, బహురూప, త్రయంబక, అపరాజిత, వృసకపి, శంభు, కపర్ది, రైవత, మృగవ్యాధ, సర్వ, మరియు కపాలి. ఇద్దరు అశ్వినీ కుమారులు అనేవారు కవలలైన దేవతా వైద్యులు.

నలభైతొమ్మిది మరుత్తులు (వాయు దేవతలు) వీరే: సత్త్వజ్యోతి, ఆదిత్య, సత్యజ్యోతి, తిర్యగ్జ్యోతి, సజ్యోతి, జ్యోతిష్మన, హరిత, రితజిత, సత్యజిత, సుశేణ, సేనాజిత, సత్యమిత్ర , అభిమిత్ర, హరిమిత్ర, కృత, సత్య, ధృవ, ధార్త, విధార్త, విధారయ, ధ్వాంత, ధుని, ఉగ్ర, భీమ, అభియు, సాక్షిప, ఇద్రిక, అన్యద్రిక, యద్రిక, ప్రతికృత, ఋక్, సమితి, సంరంభ, ఇద్రిక్ష, పురుష, అన్యద్రిక్ష, చేతస, సమిత, సమిద్రిక్ష, ప్రతిద్రిక్ష, మారుతి, సరత, దేవ, దిశ, యజుః, అనుద్రిక, సమ, మానుష, మరియు విష.