Bhagavad Gita: Chapter 18, Verse 17

యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే ।
హత్వాఽపి స ఇమాఁల్లోకాన్న హంతి న నిబధ్యతే ।। 17 ।।

యస్య — ఎవరైతే; న అహంకృతః — కర్తృత్వ భావమును విడిచి; భావో — స్వభావము; బుద్ధిః — బుద్ధిః; యస్య — ఎవరైతే; న లిప్యతే — మమకారాసక్తి లేకుండా; హత్వా — సంహరించినా; అపి — కూడా; సః — వారు; ఇమాన్ — ఈ; లోకాన్ — ప్రాణులు; న హంతి — చంపినట్టు కాదు; న నిబధ్యతే — దానిచే బంధింపబడరు.

Translation

BG 18.17: కర్తృత్వ అహంకార భావమును (చేసేది నేనే అన్న భావమును) విడిచిపెట్టి, బుద్ధి మమకారాసక్తి రహితముగా ఉండే వారు, ప్రాణులను సంహరించినా సరే, వారు చంపినట్టు కాదు మరియు కర్మ బంధనములకు లోనుకారు.

Commentary

గత శ్లోకంలో మూఢబుద్ధిని వివరించిన శ్రీ కృష్ణుడు, ఇక ఇప్పుడు స్వచ్ఛమైన బుద్ధిని వివరిస్తున్నాడు. పవిత్రమైన బుద్ధి కలవారు, చేసేది తామే (కర్తృత్వ భావన) అన్న అహంకారమును విడిచి పెట్టి ఉంటారు. తమ కర్మ యొక్క ఫలములను భోగించాలనే కోరికతో కూడా ఉండరు. ఆ విధంగా వారు తాము చేసిన పనుల యొక్క కర్మ బంధనములలో చిక్కుకోరు. ఇంతకు క్రితం 5.10వ శ్లోకంలో కూడా, కర్మఫలాసక్తిని విడిచిపెట్టిన వారు పాపముచే కళంకితులు కారు అని చెప్పి ఉన్నాడు. భౌతిక దృక్పథం పరంగా, వారు పనిచేస్తున్నట్లే ఉంటారు కానీ ఆధ్యాత్మిక కోణంలో, వారు స్వార్థ ప్రయోజనాలకు అతీతముగా ఉంటారు, కాబట్టే వారు కర్మఫలములకు బందీలు కారు.

భారత చరిత్రలో, మొఘల్ సామ్రాజ్య కాలంలో, రహీమ్ ఖాన్‌ఖనా, ఒక ప్రఖ్యాత కవి, సాధువు. జన్మతహా ఇస్లామ్ మతస్థుడైనా, ఆయన శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క గొప్ప భక్తుడు. ఆయన ఎప్పుడైనా దానములో భిక్ష ఇస్తే, తన కళ్ళు క్రిందికి వంచేవాడు. ఆయన ఈ అలవాటు గూర్చి ఒక మధురమైన సంఘటన ఉంది. సంత్ తులసీదాసుకి ఈ రహీమ్ యొక్క దానమిచ్చే పద్ధతి తెలిసి, ఆయనను ఇలా అడిగారు :

ఐసీ దేనీ దేన జ్యూఁ, కిత సీఖే హో సైన
జ్యోఁ జ్యోఁ కర ఊంచ్యో కరో, త్యోఁ త్యోఁ నీచే నైన

‘అయ్యా, ఈ దానం ఇచ్చే పద్ధతిని మీరు ఎక్కడ నేర్చుకున్నారు?. మీ చేతులు పైకి ఉన్నా మీ కళ్ళు క్రిందికి ఉన్నాయి.’ అని. దీనికి రహీం చాలా అందంగా ఎంతో వినమ్రతతో ఇలా బదులిచ్చాడు:

దేనహార కోఇ ఔర్ హై, భేజత హై దిన రైన
లోగ భరమ హమ పర కరేఁ, యాతే నీచే నైన

‘అసలు ఇచ్చేవాడు వేరే ఉన్నాడు, పగలు, రాత్రి ఇస్తున్నాడు. కానీ, ప్రపంచం నేను ఇచ్చాను అనుకుంటున్నది, అందుకే నేను నా కళ్ళను క్రిందికి దించుకుంటున్నాను.’ అని.

మనము సాధించినవాటన్నిటికీ కేవలం మనమొక్కళ్ళమే కారణము అన్న భావన విడిచిపెడితే, అది మనలను కర్తృత్వ అహంకార భావన నుండి విముక్తి చేస్తుంది.