Bhagavad Gita: Chapter 18, Verse 46

యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్ ।
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః ।। 46 ।।

యతః — ఎవని నుండయితే; ప్రవృత్తిః — ఇదంతా జనించినదో; భూతానాం — సర్వ ప్రాణుల యొక్క; యేన — ఎవరి ద్వారా అయితే; సర్వం — సమస్తమూ; ఇదం — ఇది; తతమ్ — నిండినిబిడీకృతమైనదో ; స్వ-కర్మణా — స్వకర్మ చేత (సహజసిద్ధ వృత్తి చేత); తమ్ — ఆయనను; అభ్యర్చ్య — ఆరాధించటం చేత; సిద్ధిం — సిద్ధి; విందతి — పొందును; మానవః — మనుష్యుడు.

Translation

BG 18.46: తన సహజస్వభావ వృత్తిని నిర్వర్తించటం ద్వారా వ్యక్తి - సమస్త భూతములూ ఎవని నుండి ఊద్భవించాయో మరియు ఎవ్వనిచే ఈ జగమంతా నిండి నిబిడీకృతమై ఉన్నదో - వానిని ఆరాధించినట్టు. ఇటువంటి పనులు చేయటం ద్వారా వ్యక్తి సునాయాసముగానే సిద్ధిని పొందుతాడు.

Commentary

భగవంతుని సృష్టిలో ఏ ఒక్క ఆత్మ (జీవి) కూడా అనావశ్యకమైనది ఉండదు. సమస్త జీవుల యొక్క క్రమబద్ధమైన పురోగతి కోసమే ఆయన యొక్క దివ్య ప్రణాళిక రచించబడినది. భారీ చక్రంలో చిన్ని పళ్ళచక్రంలా మనమందరమూ ఆయన బృహత్ పథకంలో భాగాలమే. ఆయన మనకిచ్చిన సామర్థ్యము కంటే ఎక్కువ మననుండి ఏమీ ఆయన ఆశించడు. కాబట్టి మనం కేవలం మన స్వభావం మరియు స్థాయికి అనుగుణముగా మన స్వధర్మాన్ని నిర్వర్తిస్తే, మనం ఆయన దివ్య ప్రణాళికలో మన అంతఃకరణ శుద్ధి కోసం పాలుపంచుకున్నట్టే. ఎప్పుడైతే మనం భక్తి యుక్త దృక్పథంలో పని చేస్తామో మన పనే ఒక ఈశ్వర-ఆరాధన అవుతుంది.

ఏ విధి కూడా అసహ్యకరమైనది మరియు అపవిత్రమైనది కాదు, దాన్ని ఏ దృక్పథం తో చేస్తున్నామనే దాని మీదనే ఆ పని యొక్క విలువ ఉంటుంది, అన్న విషయాన్ని వివరిస్తూ, మార్కండేయ ముని యుధిష్ఠిరుడికి మహాభారతంలోని వన-పర్వంలో ఒక కథ చెప్పి ఉన్నాడు.

అది ఇలా సాగుతుంది... ఒక యువ సన్యాసి అడవిలోకి వెళ్లి అక్కడ చాలాకాలం ధ్యానము మరియు తపస్సులు ఆచరించాడు. అలా కొద్ది సంవత్సరములు గడచిన తర్వాత, ఒకరోజు, ఆయన పైనున్న చెట్టు నుండి ఒక కాకి రెట్ట ఆయనపై పడింది. ఆయన కోపంతో ఆ పక్షి వంక చూసాడు, దాంతో అది చచ్చిపడిపోయింది. తనకు తపశ్చర్యల ద్వారా అతీంద్రియ శక్తులు ప్రాప్తించినట్టు ఆ సన్యాసి తెలుసుకున్నాడు. మరియు చాలా గర్వపడ్డాడు.

కొద్దికాలం తరువాత ఆయన ఒక ఇంటికి బిక్ష అడగటానికి వెళ్ళాడు. ఆ ఇంటి ఆవిడ తలుపు దగ్గరకు వచ్చి, తన అనారోగ్యంతో ఉన్న భర్తకు సపర్యలు చేస్తున్నందున, ఆ సన్యాసిని కొద్దిసేపు వేచి ఉండమని ప్రార్థించింది. దీనితో ఆ సన్యాసి కోపగ్రస్తుడై, ఆమె వంక కోపంగా చూస్తూ, ఇలా మనసులో అనుకున్నాడు, ‘ఓ అధమురాలా, ఎంత ధైర్యం నన్ను వేచి ఉండమని చెప్పటానికి! నా శక్తులు ఏమిటో నీకు తెలియదు.’ అని. ఆయన మనస్సులో ఉన్నది గ్రహించి, ఆ స్త్రీ ఈ విధంగా అన్నది , ‘నా పట్ల అలా కోపముగా చూడకు, నేనేమి కాకిని కాదు, నీ కోపంతో చూసిన చూపుకు భస్మమై పోవటానికి.’ అని. ఆ సన్యాసి ఆశ్చర్యచకితుడై పోయాడు, ఆ సంఘటన గూర్చి ఆమెకెలా తెలుసు అని అడిగాడు. ఆ ఇంటిఆవిడ తాను ఏమీ తపస్సులు చేయలేదు కానీ, తన విధుల్ని భక్తితో మరియు శ్రద్ధతో చేసాను అని చెప్పింది. అందుచే, ఆవిడకు తేజస్సు ప్రాప్తించి, ఆయన మనస్సులో ఉన్నది తెలుసుకోగలిగింది. ఆ తరువాత అతనిని మిథిలా నగరంలో ఉండే ఒక ధర్మాత్ముడైన కసాయివాడిని కలవమని చెప్పింది, మరియు ఆయన ఇతని యొక్క ధర్మసందేహాలకు జవాబు చెప్పగలడు అని చెప్పింది.

ఆ సన్యాసి మొదట్లో ఆ తక్కువ స్థాయి కసాయివాడితో మాట్లాడటానికి తనకు కలిగిన సంకోచాన్ని అధిగమించి, మిథిలా నగరానికి వెళ్ళాడు. ధర్మాత్ముడైన ఆ కసాయివాడు, అప్పుడు, మనకందరికీ మన పూర్వజన్మ కర్మలు, మరియు సామర్థ్యమును అనుసరించి స్వ-ధర్మములు ఉన్నాయని చెప్పాడు. అయినా, మనం స్వార్థ చింతనను విడిచి, మనకొచ్చే సుఖదుఃఖాలకు అతీతంగా ఉంటూ, మన సహజ స్వభావ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే, మనం మనల్ని పరిశుద్ధి చేసుకుని, పై మెట్టు ధర్మ స్థాయికి చేరుకుంటాము. ఈ విధంగా, కర్తవ్య విధులను, వాటి నుండి పారిపోకుండా నిర్వర్తిస్తే, జీవాత్మ క్రమక్రమంగా తన ప్రస్తుత మొరటు దృక్పథం నుండి దివ్యమైన ఆధ్యాత్మిక చైతన్యం వైపు పురోగమిస్తుంది. ఆ కసాయివాడు చెప్పిన ఉపదేశమే మహాభారతంలో వ్యాధ గీత అని అంటారు.

ఈ ఉపదేశం ప్రత్యేకంగా అర్జునుడికి బాగా వర్తిస్తుంది, ఎందుకంటే, కష్టతరం మరియు బాధాకరం అని భావించి, అర్జునుడు తన స్వ-ధర్మము నుండి పారిపోదలచాడు. తన స్వధర్మాన్ని సరైన దృక్పథంలో చేయటం ద్వారా అర్జునుడు ఈశ్వరుణ్ణి ఆరాధించినట్టే అని, తద్వారా పరిపూర్ణ సిద్ధిని సునాయాసంగా సాధించవచ్చు అని, ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు.