Bhagavad Gita: Chapter 4, Verse 1

శ్రీ భగవానువాచ ।
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ ।
వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేఽబ్రవీత్ ।। 1 ।।

శ్రీ భగవానువాచ — పరమేశ్వరుడైన శ్రీ కృష్ణ భగవానుడు పలికెను; ఇమం — ఈ యొక్క; వివస్వతే — సూర్య భగవానునికి; యోగం — యోగ శాస్త్రము; ప్రోక్తవాన్ — ఉపదేశించాను; అహం — నేను; అవ్యయం — సనాతనమైన; వివస్వాన్ — సూర్య భగవానుడు; మనవే — మనువుకు, మానవ జాతి యొక్క మూల పురుషుడు; ప్రాహ — చెప్పెను; మనుః — మను; ఇక్ష్వాకవే — ఇక్ష్వాకుడుకి, సూర్య వంశపు మొదటి చక్రవర్తి; అబ్రవీత్ — బోధించెను.

Translation

BG 4.1: పరమేశ్వరుడైన శ్రీ కృష్ణ భగవానుడు ఇలా అన్నాడు: నేను ఈ యొక్క సనాతనమైన యోగ శాస్త్రమును సూర్య భగవానుడైన వివస్వానుడికి చెప్పాను. అతను మనువుకి, మనువు ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించారు.

Commentary

అమూల్యమైన, వెలకట్టలేని జ్ఞానాన్ని ఎవరికైనా కేవలం తెలియపరిస్తే సరిపోదు. ఆ జ్ఞానాన్ని అందుకున్నవారు దాని విలువని తెలుసుకొని, గౌరవించాలి మరియు ఆ జ్ఞానం యొక్క ప్రామాణికత మీద విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడే వారు తమ జీవిత నడవడికలో దానిని ఆచరించటానికి కావలసిన పరిశ్రమ చేస్తారు. అర్జునుడికి తను అనుగ్రహించే ఆధ్యాత్మిక విజ్ఞానం యొక్క విశ్వసనీయత, ప్రాముఖ్యతని ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు స్థిరపరుస్తున్నాడు. తను ఉపదేశించే ఈ జ్ఞానం, కేవలం అర్జునుడిని యుద్ధం కోసం ప్రేరేపించే సౌలభ్యం కోసం, అప్పటికప్పుడే పుట్టించింది కాదు అని శ్రీ కృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు. శ్రీ కృష్ణుడు మొట్టమొదట వివస్వానుడికి, అంటే సూర్య భగవానుడికి, ఇదే యోగ శాస్తాన్ని బోధించాడు. అతను మానవ జాతికి మూలపురుషుడైన మనువుకి, మనువు దానిని సూర్య వంశ ప్రథమ రాజైన ఇక్ష్వాకుడికి బోధించారు. ఇది జ్ఞాన సముపార్జన యొక్క అవరోహణ క్రమం; ఈ పద్ధతిలో జ్ఞానంపై సంపూర్ణ ప్రామాణ్యము కలిగిన వారు దానిని తెలుసుకోగోరిన వారికి ఆపాదిస్తారు.

దీనికి భిన్నంగా, ఆరోహణ క్రమ జ్ఞాన సముపార్జన పద్ధతిలో, విజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి స్వంత ప్రయత్నం ద్వారా పరిశ్రమించాల్సి ఉంటుంది. ఈ ఆరోహణ క్రమ పద్ధతి కఠినమైనది, లోపభూయిష్టమైనది మరియు చాలా సమయం తీసుకుంటుంది. ఉదాహరణకి ఫిజిక్స్ (భౌతిక శాస్త్రం) నేర్చుకోవాలంటే, ఆరోహణ క్రమ పద్ధతిలో ప్రయత్నించవచ్చు - ఈ పద్ధతిలో మన సొంత తెలివితో ఆయా సూత్రాలను ఊహకల్పన చేసి ఒక అభిప్రాయానికి రావచ్చు; లేదా అవరోహణ పద్ధతిలో నేర్చుకోవచ్చు – ఈ పద్ధతిలో మనం ఫిజిక్స్ బాగా తెలిసిన ఒక ఉపాధ్యాయుడిని ఆశ్రయిస్తాము. ఆరోహణ క్రమ పద్ధతి చాలా సమయం తీసుకుంటుంది, నిజానికి ఈ రకమైన అధ్యయనానికి ఒక జీవిత కాలం సరిపోకపోవచ్చు. తుదకు తేలిన విషయాలు నిజమైనవో కాదో కూడా మనకు నమ్మకముండదు. పోల్చి చూస్తే, అవరోహణ క్రమ పద్ధతితో ఫిజిక్స్ యొక్క నిగూఢ రహస్యాలు మనకు తక్షణమే తెలుస్తాయి. మన ఉపాధ్యాయుడికి ఫిజిక్స్‌లో సంపూర్ణ జ్ఞానం ఉంటే ఇది చాలా సులువౌతుంది – ఆయన చెప్పిన దాన్ని శ్రద్ధతో విని దాన్ని జీర్ణం చేసుకోవటమే మన పని. ఈ యొక్క అవరోహణ క్రమంలో ఉన్న జ్ఞాన సముపార్జన ప్రక్రియ సులువైనది మరియు దోషరహితమైనది.

ప్రతి సంవత్సరం కొన్ని వేల స్వయం-సహాయక (self-help) పుస్తకాలు విపణిలో విడుదలవుతాయి. అవి, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆయా రచయితల యొక్క పరిష్కారాలను వివరిస్తాయి. ఈ పుస్తకాలు, ఒక పరిమితిలో సహాయపడవచ్చు, కానీ ఇవి ఆరోహణ క్రమ పద్ధతిలో పొందిన జ్ఞానం ఆధారంగా వ్రాయబడ్డాయి కాబట్టి అవి లోపభూయిష్టమయినవి. ప్రతి కొన్ని సంవత్సరాలకీ, ఏదో ఒక కొత్త సిద్ధాంతం వచ్చి ఆ సమయంలో ఉన్న సిద్ధాంతాలని పక్కకి నెడుతుంది. ఈ యొక్క ఆరోహణ పద్ధతి అనేది పరమ సత్యాన్ని తెలుసుకోవటానికి పనికిరాదు. దివ్య జ్ఞానాన్ని స్వీయ-పరిశ్రమ ద్వారా సృష్టించవలసిన అవసరం లేదు. అది భగవంతుని యొక్క శక్తి, ఎలాగైతే అగ్ని ఉన్నప్పటి నుండీ దాని వెలుగు, వేడిమి ఉంటాయో, అది (దివ్య జ్ఞానం) భగవంతుడు ఉన్నప్పటి నుండీ ఉంది.

భగవంతుడు మరియు జీవాత్మ రెండూ కూడా సనాతనమైనవి, అలాగే జీవాత్మను భగవంతునితో కలిపే యోగ శాస్త్రము కూడా సనాతనమైనదే. దీని కోసం ఏదో ఊహించి, కొత్తకొత్త సిద్ధాంతాలను తయారుచేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రత్యక్షసత్యం యొక్క అద్భుతమైన తార్కాణం, ఈ భగవద్గీతయే. ఇది చెప్పబడి యాభై శతాబ్దములు దాటినా, తనలో ఉన్న శాశ్వత/సనాతన జ్ఞాన ప్రజ్ఞతో, ఇది ఇప్పటికీ మన దైనందిన జీవితంలో ఉపయోగపడుతూ, జనులను ఆశ్చర్య చకితులను చేస్తున్నది. తాను అర్జునుడికి తెలియజేసే ఈ యోగ విద్య జ్ఞానం, సనాతనమైనది మరియు ప్రాచీన కాలంలో అవరోహణ క్రమంలో గురువు నుండి శిష్యుడికి పరంపరగా అందించబడింది అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.