Bhagavad Gita: Chapter 4, Verse 5

శ్రీ భగవానువాచ ।
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున ।
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ।। 5 ।।

శ్రీ భగవానువాచ — శ్రీ భగవానుడు పలికెను; బహూని — చాలా; మే — నావి; వ్యతీతాని — గడిచినవి; జన్మాని — జన్మలు; తవ — నీవి; చ — మరియు; అర్జున — అర్జునా; తాని — అవి; అహం — నాకు; వేద — తెలుసు; సర్వాణి — అన్నీ; న — కాదు; త్వం — నీకు; వేత్థ — తెలుసు; పరంతప — అర్జునా, శత్రువులను తపింపచేయువాడా.

Translation

BG 4.5: శ్రీ భగవానుడు ఇలా అన్నాడు: మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడచినవి, ఓ అర్జునా. నీవు వాటిని మరిచిపోయావు, కానీ, అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి, ఓ పరంతపా.

Commentary

తాను అర్జునుడి ముందు మానవ రూపంలో నిల్చుని ఉన్నంత మాత్రమున తనను మానవులతో సమానంగా పరిగణించవద్దు అని వివరిస్తున్నాడు శ్రీ కృష్ణుడు. ఒక దేశ రాష్ట్రపతి ఒక్కోసారి కారాగారానికి చూడడానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు, కానీ మనకు జైల్లో రాష్ట్రపతి కనపడితే, ఆయన కూడా ఖైదీనే అని తప్పుగా భావింపము. ఆయన కేవలం తనిఖీ చేయటానికే ఇలా వచ్చాడు అని మనకు తెలుసు. ఇదే ప్రకారంగా, భగవంతుడు ఒక్కోసారి ఈ భౌతిక ప్రపంచంలోకి అవతరిస్తూ ఉంటాడు, కానీ అతని దైవీ గుణాలు, దివ్య శక్తులు ఏమాత్రం తగ్గవు.

ఈ శ్లోకంపై తన భాష్యంలో శంకరాచార్యులు ఇలా అంటారు: యా వాసుదేవే అనీశ్వరాసర్వజ్ఞాశంకా మూర్ఖానాం తాం పరిహరన్ శ్రీ భగవానువాచ (4.5వ శ్లోకంపై శారీరక భాష్యం) అంటే ‘శ్రీ కృష్ణుడు భగవంతుడేనా అని ఏ మూర్ఖులకైనా సందేహం ఉంటే, దానిని ఖండించటానికే ఆయన ఈ శ్లోకం చెప్పాడు.’ నమ్మకం లేని కొంత మంది, శ్రీ కృష్ణుడు కూడా మనలాగే పుట్టాడు; మనలాగే భుజించాడు, త్రాగాడు, నిద్రపోయాడు; కాబట్టి ఆయన భగవంతుడు అవ్వటానికి అవకాశం లేదు అని వాదించవచ్చు. ఇక్కడ శ్రీ కృష్ణుడు, జీవాత్మకి, భగవంతునికి ఉన్న తేడాని స్పష్టంగా వివరిస్తున్నాడు; తను ఎన్నో సార్లు ఈ ప్రపంచంలో అవతరించినా ఆయన సర్వజ్ఞుడుగానే ఉంటాడు, అదే సమయంలో జీవాత్మ యొక్క జ్ఞానం మాత్రం పరిమితమైనది.

జీవాత్మకి, పరమాత్మ అయిన భగవంతునికి చాలా పోలికలున్నాయి - రెండూ సత్-చిత్-ఆనందములే (సనాతనమైనవి, చైతన్యవంతమైనవి, మరియు ఆనంద స్వరూపాలు). కానీ ఎన్నో తేడాలు కూడా ఉన్నాయి. భగవంతుడు సర్వ-వ్యాపి, జీవాత్మ తను ఉన్న శరీరంలోనే వ్యాపించి ఉంటుంది; భగవంతుడు సర్వశక్తివంతుడు, కానీ జీవాత్మకి తనను తాను మాయా మొహం నుండి కూడా భగవంతుని కృప లేకుండా విడిపించుకునే శక్తి లేదు; భగవంతుడు ఈ ప్రకృతి నియమాలను సృష్టించిన వాడు, ఆత్మ ఈ నియమాలకు బద్దుడై ఉంటుంది; భగవంతుడు సమస్త సృష్టికి ఆధారభూతమైనవాడు, జీవాత్మకు కూడా ఆయనే ఆధారం; భగవంతుడు సర్వజ్ఞుడు, కానీ జీవాత్మ ఒక్క విషయం పైన కూడా సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండదు.

శ్రీ కృష్ణుడు అర్జునుడిని ఈ శ్లోకం లో ‘పరంతప’ అంటున్నాడు, అంటే ‘శత్రువులను వశపరుచుకునే వాడా’ అని. ఆయన భావం ఏమిటంటే, ‘అర్జునా, నీవు ఎంతో మంది బలీయమైన శత్రువులను సంహరించిన వీర యోధుడవు. నీ మనస్సులో కలిగిన సందేహం ముందు ఇప్పుడు ఓటమిని అంగీకరించకు. నేను ఇప్పుడు నీకిచ్చే జ్ఞాన ఖడ్గంతో దానిని నిర్మూలించి, వివేకవంతుడవై ఉండుము.’ అని.

Watch Swamiji Explain This Verse