Bhagavad Gita: Chapter 4, Verse 11

యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ।। 11 ।।

యే — ఎవరు; యథా — ఏ విధంగా నైతే; మాం — నాకు; ప్రపద్యంతే — శరణాగతి చేస్తారో; తాం — వారిని; తథా — ఆ విధంగా; ఏవ — ఖచ్చితంగా; భజామి — ప్రతిస్పందిస్తాను (అనుగ్రహిస్తాను); అహం — నేను; మమ — నా యొక్క; వర్త్మ — మార్గము; అనువర్తంతే — అనుసరిస్తారు; మనుష్యాః — మానవులు; పార్థ — అర్జున; సర్వశః — అన్ని విధములా.

Translation

BG 4.11: నాకు ఏ ప్రకారంగా మనుజులు శరణాగతి చేస్తారో, నేను వారికి ఆ విధంగా ప్రతిస్పందిస్తాను. తెలిసినా, తెలియకపోయినా, అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు, ఓ ప్రిథ తనయుడా (అర్జునా).

Commentary

తనకు శరణాగతి చేసిన వారందరికీ తన అనుగ్రహంతో ప్రతిస్పందిస్తానని ఇక్కడ శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. భగవంతుని ఉనికిని తిరస్కరించిన వారికి, ఆయన కర్మసిద్ధాంత రూపంలో కలుస్తాడు – వారి హృదయాల్లోనే కూర్చుండి, వారి కర్మలను నోట్ చేస్కుంటూ, వాటి ఫలితాలను ఇస్తుంటాడు. కానీ, ఇలాంటి నాస్తికులు సైతం ఆయన సేవ చేయకుండా తప్పించుకోలేరు; వారు భగవంతుని భౌతిక శక్తికి సేవ చేయాల్సిందే, మాయ ఎన్నో స్వరూపాల్లో వ్యక్తమవుతుంది – సంపద, భోగాలు, బంధువులు, కీర్తి, మొదలగునవి. మాయా శక్తి, వారిని కామ, క్రోధ, లోభ గుణములతో బంధించివేస్తుంది. అదే సమయంలో మరోపక్క, ప్రాపంచిక భౌతిక ఆకర్షణల నుండి తమ మనస్సుని పక్కకి మరల్చి, భగవంతుడే తమ లక్ష్యము, ఆశ్రయముగా బ్రతికేవారి అన్ని అవసరాలను, తల్లి తన బిడ్డ బాగోగులు చూసుకున్నట్లుగా, ఆయనే చూసుకుంటాడు.

శ్రీ కృష్ణుడు ‘భజామి’ అన్న పదం ఇక్కడ వాడాడు, అంటే ‘సేవ చేయటం’. శ్రీ కృష్ణుడు, ఆయనకు శరణాగతి చేసిన వారి యొక్క అనంతమైన జన్మల సంచిత కర్మను నాశనం చేస్తాడు, మాయా బంధనము నుండి విముక్తి చేస్తాడు, భౌతిక సంసార చీకటి తొలగిస్తాడు, దివ్యానందాన్ని, దివ్య జ్ఞానాన్ని మరియు దివ్య ప్రేమని ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే భక్తుడు భగవంతుడిని నిస్వార్థంగా ప్రేమించటం నేర్చుకుంటాడో, తను స్వయంగా వారి ప్రేమకు బానిసైపోతాడు. శ్రీ రాముడు హనుమతో ఇలా అన్నాడు:

ఏకైకస్యోపకారస్య ప్రాణాన్ దాస్యామి తే కపే
శేషస్యేహోపకారాణాం భవాం ఋణినో వయమ్

(వాల్మీకి రామాయణం)

 

‘ఓ హనుమా, నీవు చేసిన ఒక సేవ (ఉపకారం) యొక్క ఋణం తీర్చుకోవటానికే నా జీవితాన్ని నీకు ఇచ్చేయాలి. నీచే చేయబడిన మిగతా అన్ని భక్తి యుక్తసేవలకు, నేను నీకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను.’ ఈ విధంగా, భగవంతుడు తనను శరణువేడిన అందరినీ అదే విధంగా కాపాడి, ఆదుకుంటాడు.

భగవంతుడు ఇంత పరమ దయాళువు అయినప్పుడు, కొందరు అన్య దేవతలను ఎందుకు పూజిస్తారు? తదుపరి శ్లోకంలో వివరిస్తున్నాడు.