Bhagavad Gita: Chapter 4, Verse 23

గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః ।
యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే ।। 23 ।।

గత-సంగస్య — భౌతిక ప్రాపంచిక ఆసక్తిరహితంగా ఉండి; ముక్తస్య — ముక్తులైనవారు; జ్ఞాన-అవస్థిత — ఆధాత్మిక జ్ఞానంలో స్థితులై; చేతసః — ఎవరి బుద్ధయితే; యజ్ఞాయ — భగవత్ అర్పితముగా; ఆచరతః — ఆచరిస్తూ; కర్మ — పని; సమగ్రం — సంపూర్ణముగా; ప్రవిలీయతే — విముక్తి పొందుతారు.

Translation

BG 4.23: అటువంటి వారు ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేయబడుతారు మరియు వారి బుద్ధి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉంటుంది. వారు చేసే ప్రతి పని, యజ్ఞం (భగవత్ అర్పితము)గా ఉంటుంది కాబట్టి వారు అన్ని రకాల కర్మ ప్రతిచర్యల నుండి విముక్తి చేయబడుతారు.

Commentary

ఇంతకు క్రితం ఐదు శ్లోకాల యొక్క సారాంశాన్ని, శ్రీ కృష్ణ పరమాత్మ, ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. సమస్త కర్మలను భగవత్ అర్పితము చేయటమనేది, ఆత్మ, శాశ్వతమైన భగవంతుని దాసునిగా తెలుసుకొన్న ఫలితంగా జరుగుతుంది. చైతన్య మహాప్రభు అన్నాడు: జీవేర స్వరూప హయ కృష్ణేర నిత్య-దాస్ (చైతన్య చరితామృతము, మధ్య లీల 20.108) ‘జీవాత్మ స్వ-స్వభావ రీత్యా భగవంతుని దాసుడు.’ ఈ జ్ఞానంలో స్థితులై ఉన్నవారు తమ సమస్త కర్మలను ఆయనకు అర్పితముగా చేస్తారు మరియు వారి పనుల వలన జనించే పాప ప్రతిక్రియల నుండి విముక్తి చేయబడుతారు.

ఇటువంటి జీవాత్మలు ఎలాంటి దృక్పథం పెంపొందించుకుంటారు? శ్రీ కృష్ణుడు, తదుపరి శ్లోకంలో వివరిస్తున్నాడు.

Watch Swamiji Explain This Verse