Bhagavad Gita: Chapter 6, Verse 2

యం సన్న్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ ।
న హ్యసంన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన ।। 2 ।।

యం — ఏమిటి; సన్న్యాసం — సన్యాసము; ఇతి — ఈ విధంగా; ప్రాహుః — అంటారు; యోగం — యోగము; తం — అది; విద్ధి — తెలుసుకొనుము; పాండవ — అర్జునా, పాండు పుత్రుడా; న — కాదు; హి — నిజముగా; అసన్న్యస్త — త్యజించకుండా; సంకల్పః — కోరిక; యోగీ — ఒక యోగి; భవతి — అగుట; కశ్చన — ఎవరైనా.

Translation

BG 6.2: సన్యాసము అని అందరూ అనుకునేది, యోగము కంటే వేరైనది కాదు. ఎందుకంటే, ఎవ్వరూ కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు.

Commentary

సన్యాసి అంటే మనో-ఇంద్రియముల సుఖాలను త్యజించిన వాడు అని. కానీ కేవలం సన్యసించటమే లక్ష్యం కాదు, ఇంకా, సన్యసించటం మాత్రమే లక్ష్యాన్ని చేరుకోవటానికి సరిపోదు. సన్యాసమంటే మనం తప్పు దిశలో పరిగెత్తటం ఆగినట్టు. మనం ఒకప్పుడు ఈ ప్రపంచంలో ఆనందాన్ని వెతుకుతూ ఉండే వాళ్ళం, కానీ భౌతిక సుఖాలలో ఆనందం లేదని అర్థం చేసుకున్నాము, కాబట్టి మనం ప్రపంచం దిశగా పరిగెత్తటం ఆపివేసాము. కానీ, ఆగిపోయినంత మాత్రాన లక్ష్యం చేరుకోలేము. ఆత్మ పొందవలసిన లక్ష్యం భగవత్-ప్రాప్తి. భగవంతుని దిశగా వెళ్ళటం - మనస్సుని ఆయన దిశగా తీసుకెళ్లటం – ఇదే యోగ మార్గము. జీవిత లక్ష్యం పట్ల అసంపూర్ణ జ్ఞానం కలవారు, సన్యాసం తీసుకోవటమే అత్యున్నత లక్ష్యంగా అనుకుంటారు. నిజమైన జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకున్నవారు, భగవత్ ప్రాప్తియే తమ ఆధ్యాత్మిక ప్రయాణ అంతిమ లక్ష్యంగా తెలుసుకుంటారు.

5.4వ శ్లోకం యొక్క వివరణలో, రెండు రకాల సన్యాసం ఉంటాయి అని చెప్పబడింది - ఫాల్గు వైరాగ్యం మరియు యుక్త వైగాగ్యం అని. ఫాల్గు వైరాగ్యం అంటే ప్రాపంచిక వస్తువులను మాయకు చెందిన (భౌతిక శక్తి) వస్తువులగా పరిగణించి, ఆధ్యాత్మిక పురోగతికి అవరోధంగా ఉంటాయి కాబట్టి వాటిని త్యజించటం. యుక్త వైరాగ్యం అంటే సర్వమూ భగవంతునికి చెందినవనే భావించి, కాబట్టి అవన్నీ భగవత్ సేవకి ఉపయోగించబడేవే అని అనుకోవటం. మొదటి రకం సన్యాసంలో, ఇలా అంటారు, ‘డబ్బుని విడిచిపెట్టు. దానిని ముట్టుకోవద్దు. అదొక మాయా స్వరూపము, మరియు అది ఆధ్యాత్మిక పథానికి అవరోధం కలిగిస్తుంది.’ అని. రెండవ రకం సన్యాసంలో, ఇలా అంటారు, ‘డబ్బు కూడా ఆ భగవత్ శక్తి స్వరూపమే, దానిని వృథా చేయవద్దు లేదా పారేయొద్దు; నీ దగ్గర ఉన్నది ఏదైనా సరే దాన్ని భగవత్ సేవలో ఉపయోగించుము’ అని.

ఫాల్గు వైరాగ్యమనేది అస్థిర మైనది, మరల ఈ ప్రపంచంతో మమకారం ఏర్పరుచుకోవటానికి సులభంగా మారిపోతుంది. 'ఫాల్గు' అన్న పదం, బీహార్ రాష్ట్రంలోని గయ పట్టణంలో ఉన్న ఒక నది నుండి వచ్చింది. ఫాల్గు నది భూమి క్రింది పొరల్లో ప్రవహిస్తుంది. పై నుండి చూస్తే అక్కడేమీ నది ఉన్నట్టు ఉండదు, కానీ కొన్ని అడుగులు తవ్వితే, క్రింద ప్రవాహం కనపడుతుంది. ఇదే విధంగా ఏంతో మంది జనులు ప్రపంచాన్ని వదిలి ఆశ్రమంలో జీవించటానికి వెళ్తుంటారు, కానీ కొద్ది సంవత్సరాల్లోనే వైరాగ్యం మాయమై, మనస్సు తిరిగి ప్రపంచం యందే ఆసక్తి ఏర్పరుచుకుంటుంది. వారి వైరాగ్యం ఫాల్గు వైరాగ్యం. ఈ ప్రపంచం కఠినమైనది, కష్టాలతో కూడుకున్నది అని తెలుసుకొని, దాని నుండి తప్పించుకోవటానికి ఆశ్రమంలో ఉంటారు. కానీ, ఆధ్యాత్మిక జీవితం కూడా కష్టతరమైనది మరియు భారమైనది అని గ్రహించిన తరువాత వారు ఆధ్యాత్మికత నుండి కూడా విడిపోతారు. కానీ, మరికొందరుంటారు, వారు భగవంతునితో ప్రేమ పూర్వక సంబంధం ఎర్పరుచుకుంటారు. ఆయనకు సేవ చేయాలనే ప్రేరణతోనే, ప్రపంచాన్ని త్యజించి ఆశ్రమం చేరుకుంటారు. వారి సన్యాసం యుక్త వైరాగ్యము. వారు సాధారణంగా, ఎటువంటి కష్టాలు ఎదురైనా, తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు.

ఈ శ్లోకం యొక్క మొదటి పాదంలో, నిజమైన సన్యాసి అంటే ఒక యోగి అని - మనస్సుని ప్రేమ పూర్వక సేవలో భగవంతునితో ఏకం చేసేవాడు - అని, శ్రీ కృష్ణుడు చెప్పాడు. రెండవ పాదంలో, ప్రాపంచిక కోరికలను త్యజించకుండా వ్యక్తి యోగి కాలేడు, అని శ్రీ కృష్ణుడు చెప్పాడు. మనస్సులో భౌతిక ప్రాపంచిక కోరికలు ఉన్నప్పుడు అది సహజంగానే ప్రపంచం వైపు పరుగులు తీస్తుంది. భగవంతునితో ఏకమవ్వాల్సింది మనస్సే కాబట్టి, మనస్సులో ఎటువంటి ప్రాపంచిక కోరికలు లేనప్పుడే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఓ వ్యక్తి, యోగి కావాలంటే అంతర్గతంగా సన్యాసి అవ్వాలి; మరియు యోగిగా ఉంటేనే, సన్యాసి అవ్వగలడు.