Bhagavad Gita: Chapter 6, Verse 7

జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః ।
శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః ।। 7 ।।

జిత-ఆత్మనః — మనస్సుని జయించిన వాడు; ప్రశాంతస్య — ప్రశాంత చిత్తముతో; పరమ-ఆత్మా — భగవంతుడు; సమాహితః — నిశ్చలమై; శీత — చల్లదనంలో; ఉష్ణ — వేడిమిలో; సుఖ — సుఖాలలో; దుఃఖేషు — దుఃఖాలలో; తథా — మరియు; మాన — కీర్తి; అపమానయోః — అపకీర్తి.

Translation

BG 6.7: మనస్సుని జయించిన యోగులు - శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానాపమానములు - ఈ ద్వందములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతతో, భగవత్ భక్తి యందు స్థిర చిత్తముతో ఉంటారు.

Commentary

2.14వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు - ఇంద్రియములకు ఇంద్రియ-వస్తువిషయ సంపర్కంచే, మనస్సుకి శీతోష్ణములు, సుఖదుఃఖాలు అనుభవంలోనికి వస్తాయి - అని చెప్పి ఉన్నాడు. మనస్సు నిగ్రహింపబడని వరకు, వ్యక్తి ఇంద్రియ భోగ-సుఖాల కోసం వెంపర్లాడుతూనే ఉంటాడు మరియు కష్టాలనే అనుభూతులను అనుభవిస్తూనే ఉంటాడు. మనస్సుని జయించిన యోగి, ఈ క్షణభంగురమైన తాత్కాలికమైన పరిణామాలను శారీరిక ఇంద్రియ పనులుగా గుర్తించి, అవి నిత్యశాశ్వతమైన ఆత్మ కంటే వేరుగా తెలుసుకొని, వాటిచే ప్రభావితుడు కాడు. అటువంటి ఉన్నత స్థాయి యోగి శీతోష్ణములు, సుఖ-దుఃఖాలు, మాన-అపమానములు వంటి వాటికి అతీతంగా ఉంటాడు.

మనస్సు వసించేందుకు రెండే ప్రదేశాలు ఉన్నాయి - ఒకటి మాయాలోకం, మరొకటి భగవత్ లోకం. ఒకవేళ మనస్సు ప్రాపంచిక ఇంద్రియ ద్వందములకు అతీతంగా ఎదగగలిగితే అది సునాయాసముగా భగవంతుని యందు నిమగ్నమౌతుంది. ఈ విధంగా, పురోగమించిన యోగి యొక్క మనస్సు భగవంతుని ధ్యాసలో సమాధి (గాఢమైన ధ్యానం) యందు స్థితమగును అని, శ్రీ కృష్ణుడు పేర్కొన్నాడు.