Bhagavad Gita: Chapter 6, Verse 28

యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః ।
సుఖేన బ్రహ్మసంస్పర్శమత్యంతం సుఖమశ్నుతే ।। 28 ।।

యుంజన్ — ఏకమై (ఆత్మ భగవంతునితో); ఏవం — ఈ విధంగా; సదా — ఎల్లప్పుడూ; ఆత్మానాం — ఆత్మ; యోగీ — ఓ యోగి; విగత — మిముక్తి నొంది; కల్మషః — పాపములు; సుఖేన — సునాయాసముగా; బ్రహ్మ-సంస్పర్శమ్ — నిత్యము పరమాత్మతో ఉండి; అత్యంతం — అత్యున్నతమైన; సుఖమ్ — ఆనందము; అశ్నుతే — పొందును.

Translation

BG 6.28: స్వీయ-నిగ్రహం కలిగిన యోగి, ఆత్మను భగవంతునితో ఏకం చేసి, భౌతిక మలినముల నుండి స్వేచ్ఛ పొందుతాడు, మరియు ఎల్లప్పుడూ పరమాత్మతో సంయోగంతో ఉండుటచే, సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని పొందుతాడు.

Commentary

ఆనందము అనేదాన్ని నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు:

సాత్త్వికం సుఖమాత్మోత్థం విషయోత్థం తు రాజసం
తామసం మోహదైన్యోత్థం నిర్గుణం మదపాశ్రయాం

(భాగవతం 11.25.29)

తామసిక ఆనందం : మాదకద్రవ్యాలు, మద్యము, ధూమపానము, మాంసాహారము, హింస, నిద్ర, మొదలైన వాటి నుండి వచ్చే ఆనందం, ఇది.

రాజసిక ఆనందం : మనస్సు మరియు ఐదు ఇంద్రియముల తృప్తి నుండి వచ్చే ఆనందం, ఇది.

సాత్త్విక ఆనందం : కరుణ, క్షమ, ఇతరులకు సేవ, జ్ఞాన సముపార్జన, మరియు మనోనిగ్రహము వంటి సద్గుణములు ఆచరించటంతో వచ్చే ఆనందం, ఇది. జ్ఞానులు తమ మనస్సుని ఆత్మ యందే నిమగ్నం చేసినప్పుడు అనుభవించే ఆత్మ సాక్షాత్కార ఆనందం ఈ కోవకు చెందినదే.

నిర్గుణ ఆనందం : ఇది భగవంతుని దివ్య ఆనందము, ఇది పరిమాణంలో అనంతమైనది. ప్రాపంచిక భౌతిక మాలిన్యం నుండి స్వేచ్ఛ పొంది మరియు భగవంతునితో ఏకమైన యోగి, సంపూర్ణ ఆనందం యొక్క ఈ అత్యున్నత స్థాయిని పొందుతాడు అని శ్రీ కృష్ణుడు చెప్తున్నాడు. దీనినే ఆయన అనంతమైన ఆనందము అని 5.21వ శ్లోకంలో మరియు సర్వోత్కృష్ట ఆనందము అని 6.21వ శ్లోకంలో అన్నాడు.