Bhagavad Gita: Chapter 17, Verse 12

అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ ।
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్ ।। 12 ।।

అభిసంధాయ — ప్రేరేపింపబడి; తు — కానీ; ఫలం — ప్రతిఫలం; దంభ — దంభము (గర్వము); అర్థం — కోసము; అపి — కూడా; చ — మరియు; ఏవ — నిజముగా; యత్ — ఏదైతే; ఇజ్యతే — చేయబడునో; భరత-శ్రేష్ఠ — అర్జునా, భరతులలో శ్రేష్ఠుడా; తమ్ — అది; యజ్ఞం — యజ్ఞము; విద్ధి — తెలుసుకొనుము; రాజసమ్ — రజో గుణములో ఉన్న.

Translation

BG 17.12: ఓ భరత శ్రేష్ఠుడా, ప్రాపంచిక లాభము కోసము లేదా అహంకారముతో చేయబడిన యజ్ఞము, రజోగుణములో ఉన్నట్టు తెలుసుకొనుము.

Commentary

అట్టహాసముగా, ఆడంబరముగా చేసినా, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం, ‘నాకు ప్రతిఫలముగా ఏమి దక్కుతుంది?’ అన్న స్వార్థ పూరితభావనతో ఉన్నప్పుడు, ఆ యజ్ఞము అనేది భగవంతునితో వ్యాపారం చేసినట్టు అవుతుంది. శుద్ధ భక్తి అంటే వ్యక్తి తనకు తిరిగి ఏ ప్రతిఫలాన్ని ఆశించనిది. శ్రీ కృష్ణుడు ఏమంటున్నాడంటే, యజ్ఞమును ఒక గొప్ప క్రతువుగా చేయవచ్చు, కానీ అది పేరుప్రతిష్ఠ లేదా సొంతగొప్ప వంటి వాటి కోసం చేస్తే అది రాజసిక స్వభావముతో చేసినట్టు అవుతుంది అని.