Bhagavad Gita: Chapter 17, Verse 23

ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః ।
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా ।। 23 ।।

ఓం తత్ సత్ — సర్వోత్కృష్ట అలౌకికమును సూచించే పదములు; ఇతి — ఈ విధముగా; నిర్దేశః — సూచికగా నిర్దేశింపబడిన; బ్రహ్మణః — సర్వోన్నత పరమ-సత్యము; త్రి-విధః — మూడు విధములుగా; స్మృతః — పేర్కొనబడినవి; బ్రాహ్మణాః — బ్రాహ్మణులు; తేన — వారి నుండి; వేదాః — శాస్త్రములు; చ — మరియు; యజ్ఞాః — యజ్ఞము; చ — మరియు; విహితాః — జనించినవి; పురా — సృష్టి ఆరంభము నుండి.

Translation

BG 17.23: ‘ఓం తత్ సత్’ అన్న పదములు, సృష్టి మొదలు నుండి, పరబ్రహ్మమునకు సూచికగా నిర్దేశించబడినవి. వాటి నుండే పురోహితులు, శాస్త్రములు, మరియు యజ్ఞములు ఏర్పడినవి.

Commentary

ఈ అధ్యాయములో, శ్రీ కృష్ణుడు ప్రకృతి త్రిగుణముల పరంగా, మూడు విధములైన యజ్ఞములు, తపస్సులు, మరియు దానముల గురించి వివరించి ఉన్నాడు. ఈ మూడు గుణములలో, తమో గుణము అనేది ఆత్మను అజ్ఞానము, నిర్లక్ష్యము, మరియు సోమరితనపు స్థితికి దిగజారుస్తుంది. రజో గుణము అనేది జీవులను ఉద్వేగపరిచి, దానిని అసంఖ్యాకమైన కోరికలతో బంధించివేస్తుంది. సత్త్వ-గుణము ప్రశాంతమైనది మరియు ప్రకాశవంతమయినది, మరియు సద్గుణములు పెంపొందించుకోవటానికి దోహదపడుతుంది. అయినాసరే, సత్త్వ గుణము కూడా మాయా పరిధిలోనే ఉంటుంది. దాని పట్ల మనము మమకారాసక్తితో ఉండకూడదు; బదులుగా, సత్త్వగుణమును ఒక మెట్టుగా ఉపయోగించుకుని, అలౌకిక స్థాయిని చేరుకోవాలి. ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఈ మూడు గుణములకు అతీతముగా వెళుతున్నాడు; మరియు పరమ సత్యము యొక్క వివిధ స్వరూపాలను సూచించే , ఓం తత్ సత్, అన్న పదాలను వివరిస్తున్నాడు. తదుపరి శ్లోకాలలో కృష్ణుడు ఈ మూడు పదముల విశిష్టతని వివరిస్తాడు.