Bhagavad Gita: Chapter 17, Verse 7

ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః ।
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు ।। 7 ।।

ఆహారః — ఆహారము; తు — నిజముగా; అపి — కూడా; సర్వస్య — అన్నింటిలో; త్రివిధః — మూడురకములు; భవతి — ఉండును; ప్రియః — ప్రియమైన; యజ్ఞః — యజ్ఞము; తపః — తపస్సు; తథా — మరియు; దానం — దానము; తేషాం — వారికి; భేదం — భేదము; ఇమం — ఇది; శృణు — వినుము.

Translation

BG 17.7: వ్యక్తులు ఇష్టపడే ఆహారము వారి వారి స్వభావానుసారం ఉంటుంది. యజ్ఞము, తపస్సు, మరియు దానములు కూడా వారియొక్క ప్రవృత్తి బట్టి ఉంటాయి. ఇప్పుడిక ఈ భేదముల గురించి వినుము.

Commentary

మనస్సు మరియు శరీరము ఒకదానినొకటి ప్రభావితం చేసుకుంటాయి. కాబట్టి, మనుష్యులు తినే ఆహారము వారి స్వభావమును ప్రభావితం చేస్తుంది మరియు వారి స్వభావము వారి ఆహార ఇష్ట-అయిష్టములను ప్రభావితం చేస్తుంది. ఛాందోగ్య ఉపనిషత్తు ప్రకారం, మనం తినే వాటిలో ముతక(స్థూల) పదార్థం మలముగా బయటకు వచ్చేస్తుంది; మెత్తనిది మాంసముగా అవుతుంది; మరియు సూక్ష్మమైనది మనస్సుగా అవుతుంది (6.5.1). అది ఇంకా ఇలా పేర్కొన్నది: ఆహార శుద్ధౌ సత్త్వ శుద్ధిః (7.26.2) ‘స్వచ్ఛమైన ఆహారం తినటం వలన, మనస్సు పవిత్రమవుతుంది.’ అలాగే దీనికి విపర్యయం కూడా సత్యమే - పవిత్రమైన మనస్సుతో ఉండేవారు పవిత్రమైన ఆహారాన్ని ఇష్టపడుతారు.