Bhagavad Gita: Chapter 17, Verse 25

తదిత్యనభిసంధాయ ఫలం యఙ్ఞతపఃక్రియాః ।
దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః ।। 25 ।।

తత్ — తత్ అన్న పదము; ఇతి — ఈ విధముగా; అనభిసంధాయ — ఆశించకుండా; ఫలం — ఫలమును; యఙ్ఞ — యజ్ఞము; తపః — తపస్సు; క్రియాః — పనులు; దాన — దానము; క్రియాః — క్రియలు; చ — మరియు; వివిధాః — వివిధములైన; క్రియంతే — చేయబడును; మోక్ష-కాంక్షిభిః — భౌతిక బంధముల నుండి విముక్తి కోరుకునేవారు.

Translation

BG 17.25: ప్రతిఫలములను ఆశించని వారు, కానీ, ఈ భౌతిక బంధనముల నుండి విముక్తి పొందటానికి ప్రయిత్నించే వారు, తపస్సు, యజ్ఞము, మరియు దానము చేసేటప్పుడు ‘తత్’ అన్న పదమును ఉచ్చరిస్తారు.

Commentary

సమస్త కర్మల ప్రతిఫలములు ఆ భగవంతునికే చెందుతాయి, కాబట్టి, ఏ యజ్ఞమయినా, తపస్సు అయినా, లేదా దానమైనా, ఆ పరమేశ్వరుని ప్రీతికోసమే కోసమే అర్పించి, పవిత్రం చేయబడాలి. ఇక ఇప్పుడు శ్రీ కృష్ణుడు, బ్రహ్మన్‌ను సూచించే ‘తత్’ అన్న పద శబ్దము యొక్క విశిష్టతను వివరిస్తున్నాడు. యజ్ఞము, తపస్సు మరియు దానము చేసేటప్పుడు, ‘తత్’ అన్న పదమును ఉచ్చరించటం - అది భౌతిక ప్రతిఫలం కోసము కాకుండా, అది భగవత్ ప్రాప్తి ద్వారా ఆత్మ యొక్క శాశ్వత సంక్షేమం కోసము - అని సూచిస్తుంది.